Publish Date: Wed, 08 Apr 2026 (11:55 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (11:57 IST)
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి రాకా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సన్ పిక్సర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిచనున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ముఖ్యంగా, అల్లు అర్జన్ ఇప్పటివరకు కనిపించని నున్నటి గుండుతో కనిపించనున్నారు. ఈ లుక్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే'నంటూ టీమ్ ఈ లుక్‌ను షేర్ చేసింది. 'మీ అందరి ఊహలకు మించి ఈ చిత్రం ఉంటుంది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి' అంటూ టీమ్ పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు, హిందీతో సహా.. మొత్తం 7 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ గురించి అట్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఏదైనా ఒక్క ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం' అని చెప్పారు. ఇప్పుడు ఈ లుక్ చూసిన అభిమానులు 'హిట్ సినిమా లోడింగ్..' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.