బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం కావస్తున్నా, తనకు నచ్చిన నటీమణి ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించలేకపోయాననే బాధ కరణ్ జోహార్‌ను వేధిస్తోందట. అందుకేనేమో... భన్సాలీ తాజా చిత్రంలో తన సరసన ఐశ్వర్యా రాయ్‌ను బుక్ చేయమని తెగ ఒత్తిడి చేస్తున్నాడట కరణ్.
ఐష్ తన కలల రాణి అనీ, టీనేజ్ నుంచే ఆమెను ఆరాధించేవాడినని కరణ్ జోహార్ వెల్లడించాడు. తను నటించిన సినిమాల్లోని హీరోయిన్ పాత్రలన్నీ ఐష్‌ను దృష్టిలో పెట్టుకునే తయారు చేయించానని చెపుతున్నాడు. అయితే పలు కారణాల వల్ల గతంలో తను నటించిన సినిమాలలో ఐష్ కాక మిగిలిన హీరోయిన్లతో నటించాల్సి వచ్చిందని వాపోయాడు.
ఇక ఇప్పుడు ఐష్‌తో కలిసి నటించే సమయం ఆసన్నమైందనీ, ఈ ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని చెపుతున్నాడు. ఇంతకీ ఈ విషయం ఐశ్వర్యకు తెలుసా...? అని కదిలిస్తే... భన్సాలీ చెపితే ఐష్ ఎవరిప్రక్కన నటించడానికైనా సిద్ధపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అందుకే తన ఆశలన్నీ భన్సాలీపైనే పెట్టుకున్నానంటున్నాడు.
మరి భన్సాలీ, కరణ్ జోహార్ ఆశను నెరవేరుస్తాడో లేదో చూడాలి.