అమీర్ ఖాన్ "గజినీ" హిట్‌తో సంతోషంతో చెలరేగిపోయిన అసిన్ బాలీవుడ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని కోలీవుడ్ వదిలిపెట్టి ముంబయికి తుర్రుమంది. అంతేకాదు... "గజినీ" హిట్ టైంలో బాలీవుడ్ నుంచి ఎడాపెడా అవకాశాలు వచ్చినా అమ్మడు "సెలెక్టివ్... సెలెక్టివ్" అంటూ చేతిదాకా వచ్చిన సినిమాలు అంగీకరించకుండా మీనమేషాలు లెక్కబెట్టింది.
సల్మాన్ ఖాన్‌తో "లండన్ డ్రీమ్స్" చేస్తూ బాలీవుడ్‌లో తనకు ఎదురు లేదని కలలు కన్నది. కానీ ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద మోకాళ్లు డోక్కుపోతూ బోర్లాపడి లేవలేకపోయింది. దీంతో అసిన్ డీలా పడింది. ఇప్పుడేమో ఛాన్సుల కోసం వెంపర్లాడుతోంది.
చేతిలో సినిమాల్లేకుండా ఊరకనే గోళ్లు గిల్లుకుంటూ కూచువడంపై తను ఏమీ బాధపడటం లేదని చెపుతోందీ భామ. విజయాలొచ్చినప్పుడు ఎగిరి గంతులేయడం... అపజయాలొచ్చినప్పుడు మూలగటం వంటివి తన డిక్షనరీలో లేవని ధైర్య వచనాలు చెపుతోంది. భవిష్యత్‌లో ఏం చేయాలన్న దానిపై తను దృష్టి సారించినట్లు వెల్లడిస్తోంది.
ఈ ఏడాది బాలీవుడ్ బిగ్ స్క్రీన్ మొత్తాన్ని తానే ఆక్రమిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ బాలీవుడ్ నిర్మాతలెవరూ ఆఫర్ ఇస్తామని చెప్పకుండా ఆక్రమించడం ఎలా సాధ్యమో...? చూద్దాం సాధ్యం చేస్తుందేమో...!!