Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాటి 'సాక్షి' నుంచి నేటి 'శ్రీరామరాజ్యం' వరకు బాపు దృశ్యకావ్యాలే!

నాటి 'సాక్షి' నుంచి నేటి 'శ్రీరామరాజ్యం' వరకు బాపు దృశ్యకావ్యాలే!
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (08:51 IST)
తెలుగు వెండి తెరకు కొత్త పాఠాలు నేర్పిన బాపు ఇక లేరు. ఆదివారం సాయంత్రం 4.20 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. ఆయనకు వయస్సు 80 యేళ్లు. ఆయన తొలి చిత్రం "సాక్షి" నుంచి చివరి చిత్రం "శ్రీరామరాజ్యం" వరకు ప్రతిదీ ఓ దృశ్యకావ్యమే. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో బాపు చిత్రకారుడిగా ... చలనచిత్రకారుడిగా తెలుగు గుండెపై తీయని ముద్రయ్యాడు. తన చిత్రాల ద్వారా తెలుగుజాతికి తరగని కళాత్మక ఆస్తిని పంచాడు. తాను తీసిన చిత్రాల ద్వారా పదహారణాల తెలుగుదనం అంటే ఏమిటో రుచి చూపించాడు. పల్లెటూరి అమాయకులు ఎలా ఉంటారో చూపించాడు ... తేనెపూసిన కత్తులు ఎలా ఉంటాయో చూపించాడు ... బంధాలు ... అనుబంధాలు ... ప్రేమలు, ఆప్యాయతలు ... వెన్నుపోట్లు ఎలా ఉంటాయో అవీ చూపించాడు. 
 
అంతేకాకుండా, పౌరాణిక చిత్రాల్లో శ్రీరాముడు ఎలా ఉంటాడో ... మాహా సాధ్వి సీతమ్మ ఎలా వుంటుందో... కర్కోటకుడు రావణాసురుడు ఎలా ఉంటాడో... భక్త హనుమ ఎలా ఉంటాడో... భక్త కన్నప్ప ఎలా ఉంటాడో మన కళ్ళకు కట్టాడు. మన ముంగిట ముత్యాలముగ్గులు వేశాడు... మనవూరి పాండవులను, బుద్ధిమంతుడిని, అందాలరాముడిని, మిస్టర్ పెళ్లాంను, రాధా గోపాళాన్ని... మిత్రుడు రమణతో కలసి వెండితెరను స్వర్ణతెరగా మార్చేశాడు!. ఇపుడు తన చిరకాల ప్రాణ మిత్రుడు రమణను వెతుక్కుంటూ పరలోకానికేగాడు. బాపూరమణలు విడివడిగా పుట్టిన కవలలు. వీరిద్దరు భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలుగు సినిమా ఉన్నంతవరకు వీరిద్దరూ జీవించే వుంటారు ... ప్రేక్షకుల హృదయాలలో! 

Share this Story:

Follow Webdunia telugu