Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుడివాడలో నాగార్జున... నాన్నగారి విగ్రహం ప్రతిష్టించడం ఇష్టంలేదు... ఎందుకంటే...

గుడివాడలో నాగార్జున... నాన్నగారి విగ్రహం ప్రతిష్టించడం ఇష్టంలేదు... ఎందుకంటే...
, బుధవారం, 17 డిశెంబరు 2014 (20:48 IST)
కనీస విద్యాభ్యాసం లేని అక్కినేని నాగేశ్వరరావు విద్య విలువ తెలిసిన జ్ఞాని అని ఆయన కుమారుడు, సినీ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో ఏర్పాటు చేసిన అక్కినేని విగ్రహాన్ని ఆయన బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను అందజేశారు. 
 
శాస్త్ర, సాంకేతిక రంగంలో పద్మభూషణ్‌‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి, న్యాయరంగంలో జస్టిస్‌ ఎస్‌.పర్వతరావు, పౌరసేవల రంగంలో ఐఎఎస్‌ అధికారి పి.సంపత్‌కుమార్‌, విద్యారంగంలో ఎమ్‌.ఎన్‌.రాజు, చలన చిత్రరంగంలో ప్రముఖ దర్శకులు డాక్టర్‌ కె.రాఘవేంద్రరావు, ఆరోగ్య రంగంలో డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం, రంగస్థల రంగంలో గుమ్మడి గోపాలకృష్ణ, సామాజికసేవ రంగంలో డాక్టర్‌ వంశీ రామరాజు, యువత-క్రీడా రంగంలో జ్యోతి సురేఖ వెన్నంలకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. 
 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అక్కినేని తమకు తండ్రిగా మాత్రమే తెలుసునని, ఆయన ఒక నట విశ్వవిద్యాలయమని ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు భావించడం గర్వకారణమన్నారు. నాలుగో తరగతి కూడా చదవని తన తండ్రి నాలుగు తరాలకు ఉపయోగపడే విద్యాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయడం ముదావహమని చెప్పారు. ఆయన క్రమశిక్షణలో పెరిగిన తాము ఆయన కీర్తిప్రతిష్ఠలను పెంపొందించేలా ప్రవర్తిస్తామన్నారు. ఈ నేలలో పుట్టిన తన తండ్రి విగ్రహం ఈనేల మీద ఏర్పాటు చేయటం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. వాస్తవానికి  ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం తమ కుటుంబ సభ్యులెవరికీ ఇష్టం లేదన్నారు. దానికి కారణం తమ తండ్రి తమ గుండెల్లోనే గూడుకట్టుకుని ఉన్నారని పేర్కొన్నారు. 
 
ఇక నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలోనైనా తమ కుటుంబసభ్యులు ఈ ప్రాంతానికి వస్తారని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ నాలుగైదు దశాబ్దాలుగా వివిధ రంగాలలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన వారందరూ గుడివాడ పరిసరాల ప్రాంతాలకు చెందినవారేనన్నారు. తెలుగు కీర్తిప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన ఎన్‌టిఆర్‌, ఎఎన్నార్‌లు గుడివాడ ప్రాంతానికి చెందినవారు కావటం గర్వకారణమన్నారు. 
 
ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి రక్తికట్టించటం ఒక్క ఎఎన్నార్‌కే సాధ్యమైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ మంత్రివర్గ సమావేశం వల్ల రాలేకపోతూ పంపిన సందేశాన్ని మంత్రి కామినేని చదివి వినిపించారు. 
 
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), అక్కినేని కుటుంబసభ్యులు అక్కినేని వెంకట్‌, జ్యోత్స్న, నాగసుశీల, అక్కినేని అమల, సినీహీరోలు సుమంత్‌, సుశాంత్‌, అఖిల్‌, సుప్రియ, అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సభ్యులు, తానా సభ్యులు పాల్గొన్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు రావడంతో గుడివాడ రోడ్లు కిక్కిరిశాయి.

Share this Story:

Follow Webdunia telugu