చిరంజీవి తర్వాత టాలీవుడ్ నెంబర్ 1 ఎవరు...?
, శుక్రవారం, 15 ఫిబ్రవరి 2013 (18:27 IST)
టాలీవుడ్లో చిరంజీవి తర్వాత నెంబర్ 1 రేసుపై చర్చ జరుగుతోంది. 2013 సంవత్సరంలోకి అడుగుపెట్టి రెండోనెల జరుగుతోంది. నూతన సంవత్సరంలో చాలా మందికి కొన్ని లక్ష్యాలుంటాయి. గోల్స్ ఉంటాయి. సినిమా రంగంలో కూడా ఇంతే. నెంబర్‌వన్ స్థానంపై మాట్లాడుకుంటూ ఉంటారు. నేనే నెంబర్‌వన్ అని అనుకోవడం గొప్ప తృప్తిగా, గర్వంగా సంతోషంగా ఉంటుంది. ఆ విషయాన్ని వారు చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఎక్కడో దానిమీద కన్ను ఉంటుంది. చిరంజీవి తర్వాత నెంబర్ ఒన్ ఎవరు? ఎన్.టి.ఆర్. ఎఎన్.ఆర్. కృష్ణ, బాలకృష్ణ, శోభన్‌బాబు తర్వాత ఒక్కసారిగా ఊపులోకి వచ్చిన నటుడు చిరంజీవి. అంతకుముందు నేనే నెంబర్ 1 అంటూ కృష్ణ సినిమా తీశారు కూడా. అప్పట్లో ఓ సినిమా పత్రిక ఏర్పాటు చేసిన సర్వేలో కృష్ణ నెంబర్1గా నిలిచి సూపర్‌స్టార్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి మెగాస్టార్‌గా నిలిచారు. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ ఒక ట్రెండ్ సృష్టించి నిలిచాడు. ఏనాడు తెలుగు చలనచిత్రరంగంలో బాలయ్య నెంబర్ ఒన్ అనిపించుకోలేదు. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి వంటి చిత్రాలు తీసినా సక్సెస్‌లు సాధించాడే కానీ.. నెంబర్ ఒన్ పై ఆసక్తి చూపలేదు. పవన్ కళ్యాణ్ 1వ స్థానం కోసం చూస్తున్నాడా? చిరంజీవి కేంద్రమంత్రి కావడంతో సినిమాలు ఆగిపోయాయి. దాదాపు ఆరేళ్ళు దాటింది. అయినా... ఆ స్థానం ఎవరిదనే ప్రశ్నే ఉత్పన్నం తప్ప.. మహేష్ బాబు, జూ. ఎన్.టి.ఆర్. పవన్ కళ్యాణ్‌లు దానిని ఆక్రమించారని ఎవ్వరూ అనలేక 'మగధీర', గబ్బర్‌సింగ్, బిజినెస్‌మేన్, దూకుడు, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు రికార్డులు ఒకదానికొకటి బద్దలు కొట్టాయంటూ స్టేట్స్మెంట్సు ఇస్తూ.. డైరెక్ట్‌గా నెంబర్ 1 మేమే అనలేని పరిస్థితి.
లెక్కల్లో తేడా! లోగడ అయితే.... చిరంజీవి.. విషయంలో ఫ్యాన్స్ హడావుడి చేసేవారు. ఒక హీరోకి హిట్ వస్తే.. మరో హీరో హిట్‌పై కామెంట్లు చేస్తూ ఫ్యాన్స్‌లు పందాలు, హడావుడిలు చేసేవారు. రానురాను ఆ పరిస్థితి మారినా.... కొద్దోగొప్పో ఆ వాసనలు ఇంకా వీడలేదు. కలెక్షన్ల రికార్డులు అంటూ లెక్కలు వేస్తున్నారు. అయితే అందులో ఒక్కో జిల్లాలోనూ, ఒక్క రోజులో ఇన్ని లక్షలు వచ్చాయంటూ సరిపెట్టుకోవడం జరుగుతోంది. దీనికితోడు థియేటర్ల హడావుడి ఎక్కువైంది. ఏ ఒక్క హీరో కూడా వందలాది థియేటర్లకు మించి సినిమాలు విడుదల చేయడంలేదు. సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ చిత్రం నాయక్ 1200 థియేటర్లలో ఈ ఏడాది జనవరికి విడుదలయ్యాయి. అదే వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రానికి వందల సంఖ్యలో థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గతంలోని చిత్రాలను బేరీజు వేస్తూ... లెక్కలు వేయడం పరిపాటి అయింది. కానీ ఇందులో చాలా తేడాలున్నాయని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వంటివారే వ్యాఖ్యానించడం విశేషం.