Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్... రూ.12 వేలు ఫైన్ కట్టు .. టీటీఈ అసభ్య ప్రవర్తన!

ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్... రూ.12 వేలు ఫైన్ కట్టు .. టీటీఈ అసభ్య ప్రవర్తన!
, శనివారం, 23 ఆగస్టు 2014 (10:03 IST)
ఇటీవలి కాలంలో రైలు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన రైల్వే సిబ్బంది రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా టీటీఈలు, టీసీలు తాము పబ్లిక్ సర్వెంట్లమన్న విచక్షణను కూడా మరచిపోయి మరింతగా పెట్రేగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల ఓ టీటీఈ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమెపై దాడి చేసి గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ మహిళా ప్రయాణికురాలు చేసిన నేరం ఏంటంటే... సీజన్ టిక్కెట్‌పై ఫస్ట్ క్లాస్ బోగీ ఎక్కడంతో రూ.12 వేల అపరాధ చలానా రాసిన టీటీఈని ఇదేం అన్యాయమని ప్రశ్నించడమే. 
 
హైదరాబాద్‌ ఎంఎంటీస్ రైల్లో చోటు చేసుకున్న ఈ సంఘటన పూర్తి వివరాలను పరిశీలిస్తే... మియాపూర్‌కు చెందిన చంద్ర అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే రైలులోని ఫస్ట్ క్లాస్ బోగీ ఎక్కారు. ఆ బోగీలో ఆమె ఒక్కరే కూర్చొని ఉన్నారు. ఆ బోగీకి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గార్డుగా ఉన్నాడు. చందానగర్ దాటగానే నరేష్‌రాజ్ అనే టీటీఈ బోగీలోకి ఎక్కి టికెట్ చూపించమని చంద్రను అడిగాడు. ఆమె తనవద్ద నున్న సీజన్ టికెట్‌ను చూపించింది.  
 
ఈ సీజన్ టికెట్‌తో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎందుకు కూర్చున్నావ్ అంటూనే దుర్భాలాడాడు. అవసరమైతే ఫైన్ విధించుకో..  అమర్యాదగా మాట్లాడితే సహించబోనని టీటీఈని చంద్ర హెచ్చరించింది. దీంతో ఆగ్రహించిన టీటీఈ ఎక్కువ మాట్లాడుతున్నావేంటని చంద్రను బలవంతంగా తోసేశాడు. దీంతో ఆమె కిందపడిపోయి చేతులకు గాయాలయ్యాయి. దీన్ని గమనించిన ఆ బోగీలోని గార్డు టీటీఈని వారించబోగా.. ఇది నీ డ్యూటీ కాదు.. నోర్మూసుకుని కూర్చో అంటూ గార్డును టీటీఈ బెదిరించాడు. తర్వాత చంద్రకు రూ.12 వేల జరిమానా విధిస్తూ చలనా రాసి.. ఆమెను బేగంపేట్ రైల్వేస్టేషన్‌లో దింపేశాడు. 
 
దీంతో బాధితురాలు ఆర్‌పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అనంతరం రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, టీటీఈ నరేష్ కోసం గాలిస్తున్నారు. ఇదిలావుండగా చంద్ర అనే మహిళా ప్రయాణికురాలు తనతో అసభ్యకరంగా మాట్లాడి దాడికి యత్నించిందని టీటీఈ నరేష్‌రాజ్ ఆర్‌పీఎఫ్ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేసి... అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ టీటీఈ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ ఈ మహిళా ప్రయాణికురాలు లోక్‌సత్తా పార్టీ గ్రేటర్ అధ్యక్షురాలు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu