Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరంగల్ ఓటర్లు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చారు.. ఇక దూకుడే : సీఎం కేసీఆర్

వరంగల్ ఓటర్లు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చారు.. ఇక దూకుడే : సీఎం కేసీఆర్
, మంగళవారం, 24 నవంబరు 2015 (17:28 IST)
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు స్థాయి మెజార్టీని సొంతం చేసుకుని గెలుపొందడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కె చంద్రశేఖర్ రావు స్పందించారు. ఈ ఉప ఎన్నికల్లో వరంగల్ ఓటర్లు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చారన్నారు. ఈ తరహా ఘన విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. 
 
మంగళవారం వెల్లడైన ఈ ఫలితంపై కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు. వరంగల్ ప్రజలు అపూర్వ తీర్పు ఇచ్చారని శ్లాఘించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటామన్నారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ పార్టీపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. వరంగల్ ప్రజలు ఉద్యమకాలంలో, ఇపుడు టీఆర్‌ఎస్‌తోనే ఉన్నామని తెలిపారని అన్నారు. 
 
ప్రతిపక్షాలు చేసిన పిచ్చి కూతలు, ఆంధ్రజ్యోతి వంటి కొన్ని ఆంధ్రా పత్రికలు రాసిన పిచ్చి రాతలను ప్రజలు నమ్మలేదని ఈ ఎన్నికల ఫలితం నిరూపించిందన్నారు. ప్రతిపక్షాలకు వరంగల్ ప్రజలు మంచి బుద్ది చెప్పారన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో ఓ ఆంధ్రా పత్రిక పిచ్చిరాతలు రాస్తే తెలంగాణ నేతలు వాటిని పట్టుకుని ఊగులాడరని విమర్శించారు. రైతు రుణమాఫీ చేయలేదని తాను సీఎం అయిన ఐదో రోజునే తన దిష్టిబొమ్మను దహనం చేయించారని గుర్తు చేశారు. సీఎం అయిన ఐదో రోజే దిష్టిబొమ్మను దహనం చేసిన చరిత్ర దేశ రాజకీయాల్లోనే లేదని వివరించారు. 
 
అంతేకాకుండా, అఖండ మెజారీటీ ఇచ్చి ప్రజలు తమ నిర్ణయం స్పష్టంగా చెప్పారన్నారు. తమపై లేనిపోని వ్యాఖ్యలు చేసే విపక్ష నేతలు, ఆంధ్రజ్యోతి పత్రిక ఇప్పుడేమంటాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన తమ పార్టీపై అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు న్యాయం వైపు ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఏం చేయాలో తమకు మాత్రమే తెలుసని ఆయన అన్నారు. 
 
ముఖ్యంగా తాను సీఎం అయ్యాక బంగారు తెలంగాణ సాధనలో భాగంగా హుస్సేన్ సాగర్‌లో కుళ్లు నీరు తీసేస్తానంటే ఒప్పుకోరు, కూలిపోతున్న ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా నిర్మిస్తానంటే వద్దంటారు. తాను హెలీకాప్టర్‌లో సర్వే చేస్తే, కిందికి దిగమంటారు. పాదయాత్ర చేస్తే, నువ్వేమన్నా కార్పొరేటర్‌వా? అని అడుగుతారు. ఇలా అనవసరమైన లొల్లి ఎక్కువైందని ఆయన విపక్షాలపై మండిపడ్డారు. 
 
ఆంధ్రా పాలకులు తెలంగాణలో అర్థంపర్థం లేని ప్రాజెక్టులు నిర్మించారని, వీటివల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. కానీ, 2021 నాటికి తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామన్నారు. 
 
అంతేకాకుండా, ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బస్సు యాత్రను చేపట్టనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి, ఒక్కో జిల్లాలో 10 రోజులు లేదా 15 రోజులు గడిపి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టి అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని మరీ వాటిని పూర్తి చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu