Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ త్రిముఖ వ్యూహం... ఖాళీకానున్న టీ కాంగ్రెస్.. కారెక్కనున్న ఆ ముగ్గురు!

కేసీఆర్ త్రిముఖ వ్యూహం... ఖాళీకానున్న టీ కాంగ్రెస్.. కారెక్కనున్న ఆ ముగ్గురు!
, శనివారం, 4 జులై 2015 (09:05 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని మరింత దూకుడుగా అమలుచేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఆయన త్రిముఖ వ్యూహాన్ని రచించారు. ఈ వ్యూహంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు పడినట్టు జోరుగా ప్రచారంసాగుతోంది. కేసీఆర్ వ్యూహం ప్రకారం ఆ ముగ్గురు కారెక్కినట్టయితే గ్రేటర్ హైదరాబాద్‌లో టీ కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగిలినట్టేనని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
కేసీఆర్ ఆకర్ష్ పథకంలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ చేరిన విషయంతెల్సిందే. దీంతో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కాంగ్రెస్ మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్ తెరాస గూటికి చేరడం దాదాపు ఖరారైనట్టే. దానం కూడా డీఎస్‌తో పాటు గులాబీ కండువా కప్పుకోవచ్చనే ఊహాగానాలు జోరుగానే వస్తున్నాయి. 
 
ఇకపోతే సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ కూడా కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు సమచారం. త్వరలో జరిగే ‘గ్రేటర్‌’పై గులాబీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. మొత్తంమీద కేసీఆర్ అమలు చేస్తున్న ఆకర్ష్ పథకానికి టీ కాంగ్రెస్ ఖాళీ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu