Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతోనే పోటీ అంటోన్న బీజేపీ: టీఆర్ఎస్‌ సంగతేంటి?

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతోనే పోటీ అంటోన్న బీజేపీ: టీఆర్ఎస్‌ సంగతేంటి?
, గురువారం, 30 జులై 2015 (16:57 IST)
గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎంఐఎంతోనే అని బీజేపీ క్లారిటీ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు కార్యాచరణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రజాక్షేత్ర బరిలోకి దిగుతామన్నారు. గురువారం బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ అయింది. సమావేశం అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పోరాటానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎంఐఎంతోనే పోటీ అని లక్ష్మణ్ తెలిపారు. అయితే, ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పారు.
 
మరోవైపు గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్‌కు పెను సవాలుగా మారాయి. ఓ వైపు పార్టీ కేడర్ బలపడలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నగరంలో మాత్రం కారు కండిషన్లోకి రాలేదు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని నగర తెరాస నేతలు భావించారు. ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు.
 
నగరంలో తెరాస మొదటి నుంచీ వలస నేతలమీదే ఎక్కువగా ఆధారపడింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏరికోరి టీడీపీ నుంచి ఆహ్వానించి మరీ మంత్రి పదవి ఇచ్చారు. ఆయన పార్టీకి ఏమేరకు బలమో తెరాస నాయకులు చెప్పలేక పోతున్నారు. సనత్ నగర్ కు ఉప ఎన్నిక జరిగితే ఖాయంగా గెలుస్తామని ధీమాగా చెప్పే తెరాస నాయకులు కొద్ది మందే. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల వల్ల అదనంగా ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికలు జరిగితేనే ఏ సంగతీ తెలుస్తుంది.
 
మైనంపల్లి హన్మంత రావు వంటి ఒకరిద్దరు మాత్రమే కేడర్‌లో ఉత్సాహం నింపగలరు. పార్టీకి వీలైనన్ని ఓట్లు రాబట్టే సత్తా వారికి ఉంది. కానీ గ్రేటర్‌లో పాగా వేయాలంటే గట్టి కేడర్ కావాలి. దూకుడుగా ముందుకు వెళ్లే ద్వితీయ శ్రేణి నాయకత్వం కావాలి. అన్నిటికీ మించి, గెలుస్తామనే ఆత్మవిశ్వాసం ఉండాలి.
 
టీడీపీ, బీజేపీలకు ఇవన్నీ ఉన్నాయి. బలమైన కేడర్ ఉంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది. ఈ రెండు పార్టీల వారూ గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి సత్తా చాటాలని కసిగా కనిపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెరాస పోటీ చేయలేదు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో గెలిచిన టీఆర్ఎస్‌కు టీడీపీ, బీజేపీతో కష్టాలు తప్పవని రాజకీయ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu