Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాసాయి పేట ఘటన.. అయోమయంలో టీచర్లు, విద్యార్థులు

మాసాయి పేట ఘటన.. అయోమయంలో టీచర్లు, విద్యార్థులు
, శుక్రవారం, 1 ఆగస్టు 2014 (21:10 IST)
మెదక్ జిల్లా తూప్రాన్ లోని కాకతీయ టెక్నో స్కూల్ విద్యార్థులు, టీచర్ల పరిస్థితి అయోమయంగా మారింది. మాసాయి పేట రైల్వే ప్రమాదం తర్వాత స్కూల్ మూతపడటంతో ఏం చేయాలో తెలియక వారు దిక్కులు చూస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న స్కూల్ బస్సు ప్రమాదంతో మెదక్ జిల్లా తూప్రాన్ లోని కాకతీయ టెక్నో స్కూల్ మూత పడింది.
 
ఇదే స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తరలిస్తుండగా ట్రెయిన్ ఢీకొట్టి విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. అప్పటినుంచి కాకతీయ టెక్నో స్కూల్ తెరుచుకోలేదు. కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు. సుమారు 650 మంది విద్యార్థులు, 20 మంది టీచర్లున్న ఈ స్కూల్ ఇంకా తెరుచుకోకపోవడంతో వారంతా ఆందోళన పడుతున్నారు.
 
ప్రమాదానికి కారణం స్కూల్ యాజమాన్యమే అని ప్రకటించిన అధికారులు స్కూల్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో చదివే విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పిస్తామని డీఈఓ రాజేశ్వరరావు తెలిపారు. ప్రమాదం జరిగి వారం రోజులవుతున్నా స్కూల్ గుర్తింపు రద్దు ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే స్కూల్ విద్యార్థులు వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. వారితో పాటు టీచర్లు కూడా... పొరుగు విద్యార్థులు స్కూళ్లకు వెళ్తుంటే తమ పిల్లలు ఇళ్లలోనే ఉంటున్నారంటూ పేరెంట్స్ ఆందోళనకు దిగారు.
 
స్కూల్ ముందు కూచుని బడి తెరవాలంటూ నినాదాలు చేశారు. వరుసగా రెండవరోజు కూడా సుమారు వందమంది పేరెంట్స్ తూప్రాన్ వచ్చి తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. స్కూల్ వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల తరపున ఆలోచించి సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇంకో స్కూల్లో చేర్పిస్తే పుస్తకాలు, యూనిఫారం మొదలైనవన్నీ కొత్తగా కొనాల్సి వస్తుందని, అవి తమకు భారంగా మారే ప్రమాదమున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే కాకతీయ టెక్నో స్కూల్లో పనిచేసే టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులనైతే ఇతర స్కూళ్లకు పంపిస్తారు గాని మా సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. తూప్రాన్ లాంటి చిన్న ఊళ్లో ఉన్నఫలంగా 20 మంది టీచర్లకు ఉపాధి లభించే అవకాశం లేకపోవడంతో టీచర్లు అయోమయంలో పడిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu