Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

60 ఏళ్ల దరిద్రం 15 నెలల్లో పోదు.. మా నాన్న తలచుకుంటే ఎండగట్టేవారు : కేటీఆర్

60 ఏళ్ల దరిద్రం 15 నెలల్లో పోదు.. మా నాన్న తలచుకుంటే ఎండగట్టేవారు : కేటీఆర్
, గురువారం, 1 అక్టోబరు 2015 (15:25 IST)
మా నాన్న, తెరాస అధినేత, టీ సీఎం కేసీఆర్ తలచుకుంటే ఆరు దశాబ్దాల మోసాన్ని ఎండగట్టేవారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రైతులకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. శాసనసభలో రైతుల సమస్యలపై చర్చ సమయంలో విపక్షాలకు ఎక్కువ సమయం కేటాయించామని గుర్తు చేసిన కేటీఆర్.. విపక్ష సభ్యులు చెప్పిన ప్రతి మాటను ఓపిగ్గా వినినట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత విపక్ష సభ్యులకు సమాధానం ఇచ్చే పనిలోభాగంగా సభలో 15 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరించినట్టు తెలిపారు. విపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. రచ్చ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. బుధవారం సీఎం కేసీఆర్ విపక్షాలను చీల్చి చెండాడే వారు. కానీ సానుకూల దృక్పథంతో వ్యవహరించారు. సీఎం తలచుకుంటే 60 సంవత్సరాల మోసాన్ని ఎండగట్టే వారని కేటీఆర్ తీవ్ర స్వరంతో అన్నారు. 
 
కాంగ్రెస్, టీడీపీలు ఆరు దశాబ్దాల పాలనలో చేయలేని పనులను 15 నెలల కాలంలోనే తమ సర్కారు చేసిందని గుర్తు చేశారు. ఇక రైతులకు చెప్పిన విధంగా 6 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించాం. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం వీధి పోరాటాలు జరిగేవి. పోలీస్ స్టేషన్‌లో విత్తనాలు సరఫరా చేసేవారు. రైతులు చెప్పులను క్యూలైన్లలో పెట్టి పడిగాపులు కాసేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. సకాలంలోనే రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేశాం. రుణ మాఫీ చేశామని చెప్పుకొచ్చారు. 
 
ప్రతిపక్షాలు రచ్చ రాజకీయాలు చేయడం పనిగా పెట్టుకున్నాయి. 60 ఏళ్ల దరిద్రం 15 నెలల్లో పోదు. ఓపిక ఉండాలి. బీజేపీ నేతలైతే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తుంది. తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలున్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలకు సత్తా ఉంటే రాష్ట్రానికి న్యాయం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలి. నరేంద్రమోడీ తెలంగాణకు కూడా ప్రధానే. రైతులకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి కూడా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu