Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొడుకు భవిష్యత్‌ కోసం కారెక్కనున్న జానారెడ్డి?... ఎంపీ వినోద్ రాయబారం!

కొడుకు భవిష్యత్‌ కోసం కారెక్కనున్న జానారెడ్డి?... ఎంపీ వినోద్ రాయబారం!
, గురువారం, 2 జులై 2015 (08:38 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుసరిస్తున్న 'ఆపరేషన్ ఆకర్ష్' పథకానికి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెరాసలో చేరనున్నట్టు ప్రకటించారు. ఆయనతోపాటు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి దానం నాగేందర్ కూడా డీఎస్ వెంటనడిచే అవకాశముంది. 
 
ఈ నేపథ్యంలో.. తెరాస ఎంపీ, కేసీఆర్ సన్నిహితుడైన బి వినోద్ కాంగ్రెస్ సీఎల్పీ నేత కె జానారెడ్డితో బుధవారం సమావేశంకావడం పెను చర్చనీయాంశంగామారింది. కేవలం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మాత్రమే జానారెడ్డిని కలిసినట్టు బినోద్ చెపుతున్నప్పటికీ... ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగానే వీరిద్దరి మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. 
 
ఎందుకంటే.. తనకంటే తన కుమారుని రాజకీయ భవిష్యత్ కోసం జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీనికితోడు సీఎం కేసీఆర్‌తో జానారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే సీఎంగా కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేయడం లేదు కదా అసెంబ్లీలో కూడా సీఎల్పీ నేత హోదాలో తెరాసకు అనుకూలంగానే నడుచుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. 
 
ఇటీవల కేసీఆర్‌ను ఉద్దేశించి ‘ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడారో మాకు తెలియదు’ అని టీపీసీసీ కార్యాధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి ఖండించారు. వాస్తవానికి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించాల్సిన జానారెడ్డి.. మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యలపైనే విమర్శలు గుప్పించడంతో టీ కాంగ్రెస్‌ నేతలు విస్తుపోయారు. అంటే ఒకరకంగా జానా సీఎంకు మద్దతుగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 
 
అదేసమయంలో జానారెడ్డి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడుతున్నారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీ మారవచ్చని.. లేకపోతే కుమారుడికి మార్గనిర్దేశనం చేయవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటిపరిస్థితుల్లో ఎంపీ వినోద్‌.. జానాను కలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu