Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో ఆర్నెల్లలో తెరాసను ప్రజలే ఉరికిచ్చి కొడతారు : ఎర్రబెల్లి

మరో ఆర్నెల్లలో తెరాసను ప్రజలే ఉరికిచ్చి కొడతారు : ఎర్రబెల్లి
, ఆదివారం, 16 నవంబరు 2014 (13:24 IST)
మరో ఆర్నెల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజ స్వరూపం బయటపడుతుందని, అపుడు టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు ఉరికిచ్చి కొడతారని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా మోసమేనని, టీడీపీని చూస్తే వారికి వణుకు, భయం పుడుతోందని అన్నారు. అసెంబ్లీలో బిడ్డ పేరెత్తితేనే బాధపడ్డ ముఖ్యమంత్రికి, రైతుల ఆత్మహత్యలు కనపడవా అని నిలదీశారు. 
 
కనీసం వారిని పరామర్శించకపోయినా, ఆత్మహత్యల లెక్కలైనా ప్రభుత్వం వద్ద ఉండవా? అని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్‌ అసమర్థ పాలనేనని ఆయన నొక్కిచెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు. ‘రైతుల్లారా.. మీరెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మేం అండగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు.
 
కరీంనగర్‌ జిల్లాలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 56 రైతు కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లితో పాటు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఎమ్మెల్యేలు గోపీనాథ్‌, ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, ఎండిన పంటలను చూస్తే ఏడుపొస్తున్నదని... కాకమ్మ, జేజమ్మ వచ్చినా మూడేళ్ల వరకు కరెంట్‌ రాదు అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబితే రైతులు ఆత్మహత్యలు చేసుకోరా అని ఆయన ప్రశ్నించారు. 
 
బడ్జెట్‌ అంతా మోసమేనని, ఇది బోగస్‌ ప్రభుత్వమని ఎర్రబెల్లి విమర్శించారు. తనను కొనడానికి కూడా ఆయన బేరం పెట్టారని, టీడీపీ ఎమ్మెల్యేలకు వేసే తీగలు కరెంటు కోసం వేస్తే కొంతయినా ప్రయోజనం ఉంటుందని అన్నారు. మద్దతు ధరలు దక్కే దాకా ఎవరూ పత్తి విక్రయించవద్దని రైతులకు సూచించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఆత్మస్థయిర్యం నింపేందుకే తమ పార్టీ తరపున రూ.50 వేల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu