Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విపక్ష సభ్యులను శత్రువులుగా చూసే ప్రభుత్వం కాదు : సీఎం రేవంత్ రెడ్డి

Advertiesment
revanth reddy
విపక్ష సభ్యులను శత్రువులుగా చూసే ప్రభుత్వం తమది కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి నీళ్లు పారిస్తుందన్నారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఈ జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలోనే జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. 
 
'ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు అమాయకులే కాదు. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు. కుమురంభీం వంటి ఆదివాసీ వీరులు నిజాం నిరంకుశత్వంపై పోరాడారు. ఆదిలాబాద్‌ జిల్లాకు ఆధునిక విద్య, వైద్యం వంటి సదుపాయాలు ఇంకా దక్కలేదు. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకొని కాంగ్రెస్‌ కార్యకర్తలు పోరాడారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూసే ప్రభుత్వం కాదు ఇది. గతంలో సీఎం వస్తుంటే.. ప్రతిపక్ష నేతలను అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేకపోయినా.. అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇస్తున్నాం. అభివృద్ధి పనుల కార్యక్రమానికి విపక్ష ఎమ్మెల్యేలను కూడా పిలిచాం. బీఆర్‌ఎస్‌, భాజపా నేతలు మాకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.. శత్రువులు కాదు.
 
2029 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల హద్దులు మార్చవద్దని కేంద్రం చెప్పింది. కేంద్రం ఆంక్షలు ఎత్తివేయగానే.. ప్రజల ఆకాంక్షల మేరకు హద్దులు మారుస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే రూ.5,400 కోట్లను పేదల ఖాతాల్లో వేశాం. సన్నబియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన గత పాలకులకు వచ్చిందా? రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో మరొకటి లేదు. యువత మత్తుబాట వదిలి.. మైదానాల బాట పట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే ఆశయంతో ఈ ప్రభుత్వం పని చేస్తోంది' అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ అసెంబ్లీ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు... మాస్క్ ధరించిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా?