ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూపు డి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై దక్షిణాఫ్రికా జట్టు 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఉంచిన 212 పరుగుల లక్ష్యానికి బదులుగా స్కాట్లాండ్ 15.4 ఓవర్లలో 81 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో కొట్జెర్ (42) ఒక్కడే రాణించాడు.
మిగిలినవారందరూ ఘోరంగా విఫలమయ్యారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్, బోథా, వాండెర్‌మెర, మోర్కెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, పార్నెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ప్రారంభం నుంచే స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా డివిలియర్స్ (79, 34 బంతులు, 5 ఫోర్లు, 6 సిక్స్‌లు నాటౌట్) స్కాట్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డివిలియర్స్‌తోపాటు ఓపెనర్లు స్మిత్ (38), కలీస్ (48), మోర్కెల్ (24) కూడా రాణించారు. దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించిన డివిలియర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.