Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లంక బోల్తా: పాక్‌కు ట్వంటీ- 20 ప్రపంచకప్

లంక బోల్తా: పాక్‌కు ట్వంటీ- 20 ప్రపంచకప్
రెండో ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. తొలి ప్రపంచకప్‌లో టీం ఇండియా చేతిలో పరాజయంపాలై టైటిల్ ముంగిట బోల్తాకొట్టిన పాకిస్థాన్ ఈసారి ఆ కల నెరవేర్చుకుంది. శ్రీలంకతో ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

పాకిస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చిన ఆల్‌రౌండర్ అఫ్రిది ఫైనల్‌లోనూ చెలరేగి ఆడాడు. సంయమనంతో ఆడి అర్ధ సెంచరీ సాధించిన అఫ్రిది పాకిస్థాన్‌‍కు సునాయాస విజయాన్ని అందించాడు. పాకిస్థాన్ ముందు బౌలింగ్‌‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇదిలా ఉంటే శ్రీలంక ఆశలు పెట్టుకున్న కీలక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఆ జట్టు టైటిల్ ముంగిట బోల్తా కొట్టింది.

అజేయమైన అర్ధసెంచరీ(54)తో జట్టును విజయతీరాలకు చేర్చిన అఫ్రిది ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకోగా, సిరీస్ మొత్తం మంచి ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఓపెనర్ దిల్షాన్‌కు "మ్యాన్‌ అఫ్‌ ది సిరీస్‌" లభించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 139 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది.

కమ్రన్‌ అక్మల్ ‌(37), హసన్‌(19)లు తొలి వికెట్‌‍కు 48 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరి నిష్ర్కమణతో క్రీజ్‌లోకి వచ్చిన అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌ జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. చెత్త షాట్ల జోలికి వెళ్లకుండా, మధ్యమధ్యలో ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిన అఫ్రిది, మాలిక్ చివరి వరకూ అజేయంగా నిలిచారు.

అంతకుముందు టాస్‌ నెగ్గిన శ్రీలంక కెప్టెన్‌ సంగక్కర బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ఏదీ అనుకున్నట్లు జరగలేదు. భీకర ఫామ్‌లో ఉన్న దిల్షాన్ డకౌట్‌గా తొలి ఓవర్‌లోనే పెవీలియన్ దారిపట్టాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ముబా‌రక్‌ డకౌట్‌తో శ్రీలంకకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. అప్పుడు శ్రీలంక స్కోరు 2/2.

దూకుడుగా ఆడుతున్న జయసూర్య (17)ను, ఆ వెంటనే జయవర్దనేలను రజాక్ పెవీలియన్ దారిపట్టించాడు. తర్వాత సంగక్కర (64 నాటౌట్) ఒంటరిపోరాటం చేయడంతో శ్రీలంక ప్రత్యర్థి ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాక్ బౌలర్ రజాక్ ప్రారంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కష్టాల్లోకి నెట్టాడు. అనంతరం సంగక్కర రాణింపుతో కోలుకున్నప్పటికీ, శ్రీలంకకు భారీ స్కోరు సాధ్యపడలేదు.

Share this Story:

Follow Webdunia telugu