లండన్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు నెదర్లాండ్స్ షాకిచ్చింది. ట్వంటీ- 20 క్రికెట్లో ఏదైనా సాధ్యమనేందుకు ఈ మ్యాచ్ తాజా ఉదాహరణ. ఇంగ్లాండ్ ఉంచిన 163 పరుగుల బలమైన లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించి నెదర్లాండ్స్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గ్రూత్, (49), బోరెన్ (30), డొస్కాటే (22) నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా, బ్రాడ్, రషీద్, కాలింగ్‌వుడ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ప్రారంభంలో వికెట్లు కోల్పోయినా అధైర్యపడని నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్ చివరకు జట్టుకు తీపి కబురు అందించారు.
ఇదిలా ఉంటే టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు రవి బొపారా (46), రైట్ (71) తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి శుభారంభాన్ని అందించారు. అయితే దీనిని అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ పూర్తిగా స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు 162 పరుగుల వద్ద తెరపడింది.