Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుల్ ధాటికి.. విలవిలలాడిన న్యూజిలాండ్

గుల్ ధాటికి.. విలవిలలాడిన న్యూజిలాండ్
ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జయభేరి మ్రోగించింది. పాక్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ అత్యద్భుత బౌలింగ్‌.. అబ్దుల్ రజాక్ కీలక సమయంలో వికెట్లు తీసుకోవడంతో.. న్యూజిలాండ్ 99 పరుగులకే చాపచుట్టేసింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఆరంభం నుండే తడబడింది. నిషేధానికి గురై తిరిగి జట్టులోకి వచ్చిన పాక్ బౌలర్ రజాక్ కెప్టెన్ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిజం చేస్తూ.. ప్రమాదకర బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్‌కల్లుమ్‌ను వెనక్కి పంపాడు.

ఆ తర్వాత కాసేపటికే రెడ్మండ్ (15) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు వరుస పెట్టారు. ఒక్క స్కాట్ స్టైరిస్ (22) నిలదొక్కుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. సహచరులు ఒక్కరొక్కరుగా ఔటవుతుండటంతో.. ఏకాగ్రత కోల్పోయి వికెట్ అర్పించుకున్నాడు.

రజాక్, గుల్‌లు బౌలింగ్‌తో నిప్పులు చెరగడంతో అతి తక్కువ స్కోరుకే మిగిలిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్ చేరారు. రజాక్ 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకోగా.. గుల్ కేవలం ఆరు పరుగులిచ్చి ఐదు వికెట్లుపడగొట్టాడు.

అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన పాక్.. నాలుగు వికెట్ల కోల్పోయి కేవలం 13.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ ఓపెనర్లు కమ్రాన్ అక్మల్, కొత్తగా జట్టులోకి చేరిన షహజాయిబ్ హసన్‌లు శుభారంభం చేశారు.

అక్మల్ 19 పరుగులు, హసన్ 35 పరుగులు, షాహిది అఫ్రిది 29 పరుగులతో రాణించారు. కేవలం ఆరు పరుగులిచ్చి ఐదు వికెట్ల తీసిన గుల్‌కు ట్వంటీ-20లో అరుదైన రికార్డ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు సొంతమైంది. కాగా, ఈ టోర్నీ ఆరంభంలో కాస్తంత తడబడినా... రాను రాను పాక్ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. న్యూజిలాండ్‌పై విజయంతో టైటిల్ వేటలో తాము కూడా ఉన్నట్లు ప్రమాదకర సంకేతాలు పంపింది.

Share this Story:

Follow Webdunia telugu