Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లాండ్‌పై పరాజయం: భారత్ ఇంటిముఖం

ఇంగ్లాండ్‌పై పరాజయం: భారత్ ఇంటిముఖం
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ టీం ఇండియా నిష్క్రమించింది. ఆతిథ్య జట్టుతో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో టీం ఇండియా మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సూపర్ ఎయిట్ దశ నుంచి సెమీస్‌కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు.

ఇంగ్లాండ్‌పై భారత్‌ 3 పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో మిగిలిన సూపర్ ఎయిట్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ టోర్నీ నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయం కోసం 154 పరుగులు చేయాల్సిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

ప్రారంభంలోనే రోహిత్ శర్మ, రైనా వికెట్లు చేజార్చుకునన భారత్‌ను గంభీర్ (24), జడేజా (25) ఆదుకునే ప్రయత్నం చేశారు. భారత ఇన్నింగ్స్ కుదుటపడుతుందనుకునే సమయంలో గంభీర్ అవుటవటం, ఆ తురువాత మూడు ఓవర్లకే జడేజా, యువరాజ్ సింగ్ వికెట్లు వెంటవెంటనే పెవీలియన్ దారిపట్టడంతో మ్యాచ్ మళ్లీ ఇంగ్లాండ్‌వైపు మొగ్గింది.

చివర్లో ధోనీ (30 నాటౌట్), యూసఫ్ పఠాన్ (33 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. కీలకమైన సమయాల్లో బంతులు భారత బ్యాట్స్‌మెన్ వృథా చేయడం, మరింత వేగంగా ఆడకపోవడం వలన ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. అంతకుముందు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆర్పీ సింగ్‌ ప్రారంభంలోనే ఓపెనర్‌ లుక్‌రైట్‌(1)ను పెవిలియన్‌‌కు పంపాడు.

అయితే అనంతరం వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పీటర్సన్‌తో కలిసి రవిబొపార (37) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించిన రవి బొపారా, పీటర్సన్‌లు జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న తరుణంలో ఈ ప్రమాదకర జోడీని జడేజా విడదీశాడు.

అద్భుత బంతితో బొపారాను పెవిలియన్‌ పంపించిన ఆ వెంటనే పీటర్సన్‌ను కూడా ఔట్‌ చేశాడు. పీటర్సన్ 27 బంతుల్లోనే 5 ఫోర్లు, సిక్స్‌తో 46 పరుగులు చేశాడు. హర్భజన్ మూడు, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రారంభంలో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను కష్టాల్లోకి నెట్టిన ఇంగ్లాండ్ బౌలర్ సైడ్‌బాటమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu