ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన టీం ఇండియా తట్టాబుట్టా సర్దుకొని ఇంటిముఖం పట్టింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో టీం ఇండియా పరాజయం పాలైంది. దీంతో సూపర్ ఎయిట్‌ను సంపూర్ణ పరాజయాలతో ముగించింది.
ముచ్చటగా మూడు మ్యాచుల్లోనూ ఓటమిని మూటగట్టుకున్న భారత్‌పై దక్షిణాఫ్రికా సూపర్-8 చివరి మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో నెగ్గింది. బౌలర్ల శ్రమను ఈ మ్యాచ్‌లోనూ టీం ఇండియా బ్యాట్స్‌మెన్ వృథా చేశారు. కనీసం ఒక్కరైనా క్రీజ్‌లో ఉండివుంటే మ్యాచ్‌లో విజయం టీం ఇండియాదే.
అయితే అందరూ చేతులెత్తేసి అప్పటికే సెమీస్ చోటు ఖరారు చేసుకున్న దక్షిణాఫ్రికాకు బోనస్ విజయాన్ని అందించారు. టోర్నీ మొత్తం మీద ఇప్పటివరకు పరాజయం ఎరుగని దక్షిణాఫ్రికా ఉంచిన 131 పరుగుల లక్ష్యానికి బదులుగా టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (29), మరో ఓపెనర్ గంభీర్ (21), యువరాజ్(25) మిగిలినవారి కంటే పర్వాలేదనిపించారు.
అంతకుముందు ఓపెనర్ గ్రేమ్ స్మిత్ (26), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ (64) అర్ధ సెంచరీ కారణంగా దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. డివిలియర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.