ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు మరోమారు అచ్చిరాలేదు. ఫలితంగా గ్రూపు దశ నుంచే ఆ జట్టు ఇంటిముఖం పట్టింది. లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలుకావడంతో సూపర్-8కు ఆర్హత సాధించలేక పోయింది. సోమవారం జరిగిన చివరిలీగ్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
దీంతో గ్రూపు-సిలో వెస్టిండీస్, శ్రీలంక జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ సరిగా రాణించలేక పోవడంతో పత్యర్థి ముందు తక్కువ స్కోరునే ఉంచగలిగింది.
ఆ తర్వాత 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. ఆరంభంలో దిల్షాన్ (32 బంతుల్లో పది ఫోర్లతో 53 పరుగులు) చెలరేగి పోగా, మధ్యలో కీపర్ కుమార సంగక్కర 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 పరుగులు (నాటౌట్) ఆదుకున్నాడు.
చివర్లో శ్రీలంక జట్టుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినప్పటికీ ముబారక్ భారీ షాట్ కొట్టి కంగారుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సంగక్కర కైవసం చేసుకున్నాడు.