Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్జున అవార్డు పొందడానికి కోర్టుకెక్కడం బాధేసింది!

అర్జున అవార్డు పొందడానికి కోర్టుకెక్కడం బాధేసింది!
, గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:17 IST)
అర్జున అవార్డును పొందడానికి కోర్టుకెక్కడం తనను బాధించిందని అయితే, న్యాయం కోసం ఆ విధంగా పోరాడక తప్పలేదని బాక్సర్ మనోజ్ కుమార్ అన్నాడు. తన పేరు జాబితాలో చేరినందుకు ఆనందిస్తున్నానని మనోజ్ కుమార్ తెలిపాడు. 
 
ఈ ఏడాది అర్జున అవార్డులకు ఎంపిక చేసిన అథ్లెట్ల జాబితాలో మనోజ్ పేరు కనిపించలేదు. వెంటనే అతను ఈ విషయాన్ని అవార్డుల ఎంపిక కమిటీ దృష్టికి తీసుకెళ్లాడు. రివ్యూ సమావేశంలో దీనిని పరిశీలిస్తామని కమిటీ హామీ ఇవ్వడంతో మనోజ్ ఊరట చెందాడు. 
 
అయితే, రివ్యూ సమావేశం ముగిసిన తర్వాత కమిటీ విడుదల చేసిన తుది జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో కంగు తిన్నాడు. తన కంటే ఎంతో తక్కువ స్థానంలో ఉన్న జై భగవాన్‌ను ఎంపిక చేసి, తన పేరును పక్కకు తప్పించడం అన్యాయమని పేర్కొంటూ అతను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
 
దీనిపై కోర్టు విచారణ చేపట్టినప్పుడు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) వివరణ ఇచ్చాడు. మనోజ్ డోపింగ్ కేసులు పట్టుబడ్డాడని కమిటీ తప్పుగా అభిప్రాయపడిందని చెప్పాడు. ఆ కారణంగానే మనోజ్ పేరును జాబితాలో చేర్చలేదని వివరించాడు. 
 
అయితే, మనోజ్ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడలేదని తేలడంతో, ఇప్పుడు అతని పేరును చేరుస్తామని కోర్టుకు హామీ ఇచ్చాడు. కోర్టు ముందు పొరపాటును అంగీకరించడంతో సమస్యకు తెరపడింది.

Share this Story:

Follow Webdunia telugu