Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాయిగొలిపే గోవా "క్రూయిజ్ ప్రయాణం"

హాయిగొలిపే గోవా
అందమైన బీచ్‌లు, కోనసీమను తలదన్నే కొబ్బరితోటలు, రొమాంటిక్ హాలీడే స్పాట్‌లు, జీడిపప్పు, డ్రింక్ ఫెన్నీలు, కొబ్బరి తోటల నడుమ అక్కడక్కడా విసిరేసినట్లుగా ఉండే రంగు రంగుల ఇళ్లు... వీటన్నింటినీ కలగలిపి చూస్తే, అదే సుందరమైన గోవా ప్రాంతం. ఇక్కడ ఆనందానికి పగలూ, రేయీ తేడా అనేది అసలే ఉండదు.

భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉండే ఈ గోవా ప్రాంతాన్ని "కొంకణ తీరమ"ని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం.

గోవా రాజధాని పనాజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొని, కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. ఇక్కడ ఉన్న చక్కటి బీచ్‌లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద... ఇవన్నీ కలగలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.

పోర్చుగీసుల పాలనలో 450 సంవత్సరాలు సాగిన ప్రాంతం కాబట్టి... గోవాలో ఆ సంస్కృతి ఇంకా మనకు అడుగడుగునా దర్శనమిస్తుంది. ఇళ్ల నిర్మాణం కూడా యూరోపియన్ స్టయిల్‌లోనే ఉంటుంది. గోవా ప్రజలు ఇంటి ధ్యాస చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇంటిని అందంగా తీర్చి దిద్దడంలో, పరిసరాల పరిశుభ్రతలో కుటుంబ సభ్యులందరూ పాలుపంచుకుంటారు.

గోవాలో ఎక్కడ చూసినా బీచ్‌లే మనకు దర్శనమిస్తాయి. 125 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న గోవాలో అరంబల్ బీచ్, అంజున బీచ్, వాగటర్ బీచ్, మాండ్రెం బీచ్, బాగా బీచ్, మిరమార్ బీచ్, మోర్జిం బీచ్‌లు ఉత్తరం వైపున ఉంటాయి. అదే దక్షిణం వైపున కోల్వా, కావలోసియం, మోబార్, డోనాపౌలా, పాలోలెం, వర్కా, మజోర్డా బీచ్‌లు పర్యాటకులను సేదదీరుస్తుంటాయి.

అయితే ఉత్తర, దక్షిణ ప్రాంతాలు వేటికవే ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. పార్టీలు, కార్నివాల్స్, వాటర్ స్కూటరింగ్, స్కూబా డైవింగ్, విండ్ సర్ఫింగ్ లాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ఉత్తర గోవా పెట్టింది పేరైతే... ప్రశాంతంగా రిలాక్స్ అయ్యేందుకు దక్షిణ గోవా బీచ్‌లను చిరునామాగా చెప్పుకోవచ్చు.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోవాలో క్రూయిజ్ ప్రయాణం. ఇది ఎవరికయినా ఓ మర్చిపోలేని అనుభవాన్నిందనడంలో సందేహం లేదు. అరేబియన్ సముద్రం, మాండవి నదిపై క్రూయిజ్‌లలో ప్రయాణం చేస్తూ... క్రూయిజ్ డెక్ పైన గోవా పాటలకు అనుగుణంగా ఎంచక్కా డాన్సులు వేస్తూ వెళ్ళవచ్చు. గంటన్నరపాటు సాగే ఈ ప్రయాణంలో పెద్దలంతా చిన్నపిల్లలయిపోవడం ఖాయం.

Share this Story:

Follow Webdunia telugu