Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశాంతతకు మారుపేరు కోవలం బీచ్

ప్రశాంతతకు మారుపేరు కోవలం బీచ్
, బుధవారం, 23 జులై 2008 (18:41 IST)
కొబ్బరితోటల అందాలకు నిలయమైన కేరళ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడున్న అన్ని విశేషాల గురించి చెప్పుకునే సందర్భంలో కోవలంలో ఉన్న సముద్ర తీరం గురించి చెప్పుకు తీరాలి. అందమైన ఈ సముద్రతీరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది.

కేరళ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు కోవలం బీచ్‌ను తప్పకుండా సందర్శించాలని అనుకుంటుంటారు. సముద్రతీరం అనగానే ఎగసిపడే పెద్ద అలలు, తీరానికి చాలా దూరం వరకు ఇసుక తప్ప చెట్టూ చేమా కన్పించకపోవడం అనేది మనకు తెలిసిందే. అయితే ఈ విషయాల్లో కోవలం బీచ్ కాస్త ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.

కోవలం బీచ్‌లో పెద్దగా ఎగిసిపడే అలలు మనకు కన్పించవు. ఇక్కడ సముద్రం లోతు తక్కువగా ఉండడం వల్ల అలల ఉదృతి అన్నది మనకు కానరాదు. అలాగే తీరం వెంబడి లోతు తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా సముద్రపు నీళల్లో పర్యాటకులు ఆడిపాడుతుంటారు.

ఈ బీచ్‌లో మరో విశేషం ఏమిటంటే సముద్రతీరం వెంబడి బారులు తీరినట్టు కొబ్బరి చెట్లు ఉంటాయి. సముద్రం అంచునే ఇలా కొబ్బరి చెట్లు ఉండడం వల్ల ఈ ప్రదేశం క్యాన్వాస్‌పై గీచిన పెయింట్‌గ్‌లా చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన వెంటనే వస్తువులను తీరానికి దూరంగా పెట్టేసి ఓసారి సముద్రంలోకి కాలుపెట్టారంటే ఇక వెనక్కు రావాలనిపించదు.


అలలు తక్కువగా, తీరం ప్రశాంతంగా ఉండడం వల్ల పెద్దవారు సైతం పిల్లల్లా ఈ బీచ్‌లో గంతులేస్తుంటారు. అయితే నీటిలో తడవడం మా వల్లకాదు కొంచెం ప్రశాంతంగా మంచి గాలి వచ్చే ప్రదేశం ఉంటే చాలు అనుకునే పర్యాటకులకు సైతం ఈ సముద్ర తీరం ఎంతో అనుకూలం.

సముద్ర తీరం వెంట ఉన్న కొబ్బరి చెట్ల నీడలో కూర్చుని చక్కని వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే సముద్ర అందాలను సైతం వీక్షిస్తూ తన్మయత్వంలో మునిగిపోవచ్చు. దేశ, విదేశీ పర్యాటకులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది.

వసతి సౌకర్యాలు
అన్ని వర్గాల పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఈ ప్రాంతంలో వసతి సౌకర్యాలకు ఏమాత్రం కొదవలేదు. సాధారణ హోటళ్ల నుంచి ఐదు నక్షత్రాల హోటళ్ల వరకు ఈ ప్రాంతంలో పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. బీచ్‌కు కొద్ది దూరంలోనే ఈ వసతి సముదాయాలు ఉండడం వల్ల బీచ్‌లో పొద్దుపోయేవరకు విహరించి చివరగా మన విడిదికి చేరుకోవచ్చు.

మీరు కూడా ఎప్పుడైనా కేరళను సందర్శిస్తే కోవలం బీచ్‌ను తప్పకుండా చూచి రండి. ఓ చక్కని అనుభూతి మీ సొంతం చేసుకున్నవారవుతారు.

Share this Story:

Follow Webdunia telugu