సంక్రాంతి రోజున ఆవునెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే?
ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి పండుగ రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతుంటారు. అరెసెలు, చుక్కలు వంటి పిండి వంటలు నోరూరిస్తుంటాయి. మకర సంక్రాంతి నాటికి వంట ఇంటికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే సంక్రాంతి రోజున ఆవునెయ్యితో శివుడికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. ఇలాచేస్తే అన్ని భోగాలు ప్రాప్తించి చివరికి మోక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక మకర సంక్రాంతి మరుసటి రోజును కనుమ అంటారు. ఈ రోజున రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా అలంకరించి అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే పొలి చల్లటం అని అంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది నమ్మకం. అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ కలిసి కొద్దిగా కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి పొంగలిని చల్లుతుంటారు. అలాగే మంచి గుమ్మడి కాయను దిష్టి తీసి పగులకొడతారు. కనుమనాడు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను అలంకరించి పూజించటం జరుగుతుంది.