Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"గొబ్బియల్లో..! గొబ్బియల్లో..! లక్ష్మీదేవికి స్వాగతం

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల తర్వాత నాలుగోరోజున వచ్చే ఈ పండుగను ముక్కనుమ అంటారు. పెళ్లి అయిన ఆడపిల్లలు "సావిత్రి గౌరివ్రతం" అంటే... "బొమ్మల నోము" పెడతారు. గౌరీ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నైవేద్యం చేసి పిదప ఆ మట్ట బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.

ఇంతటి విశిష్టమైన పండుగనాడు... ప్రతి ఇల్లు నూతన కళలతో వెలిగిపోతుంటుంది. ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళలాడుతూ... సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటాయి.

ఈ పండుగకు లక్ష్మీదేవికి సంబంధం వుందని ప్రజలు నమ్ముతారు. పూర్వం లక్ష్మీదేవి... పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇండ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెను వెలివేశాడట. దీంతో లక్ష్మీదేవి ఏ విధమైన చింత లేకుండా ఈ మార్గశిర, పుష్య, ధనుర్మాసాల్లో.. మరింత మంది పేదల ఇళ్ళకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందని పురాణాలు చెబుతున్నాయి.

అందువల్లనే ధనుర్మాసంలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు పెడతారు. అమె మెత్తని పాదాలు పెట్టేందుకు వీలుగా ఆవుపేడ ముద్దలపై పెద్ద పువ్వులయిన తామర, గుమ్మడి పువ్వులు వుంచుతారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని కొలవటం కూడా ఆచారం. గొబ్బిలక్ష్మీ అంటే భూమాతనే. ఆమెను కొలిస్తే బోలెడు వరాలను ప్రసాదిస్తుందని విశ్వాసం.

ఈ రోజున కన్నెముత్తైదువులు బంతి, చేమంతులతో అందంగా అలంకరించుకుని "గొబ్బియల్లో...! గొబ్బియల్లో...!" అంటూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి పేరంటం పెట్టుకుంటారు.

సంక్రాంతి పండుగ దినాలలో హరిదాసులు వివిధ వేషాలతో... హరినామ సంకీర్తనలు చేస్తూ వచ్చి... "కృష్ణార్పణం" అంటూ ఇంటి ముంగిట భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. ఇక గంగిరెద్దులవారు "బసవన్న"ను ఆడిస్తూ... చిన్నారులను దీవిస్తూ ఉంటారు. ఇలా... పిట్టదొరలు, జంగమదేవరలు, బుడబుక్కలవాళ్లు వారివారి కళలను ప్రదర్శించి... వారికి ఇచ్చే కానుకలను భుజాన వేసుకుని "సుభోజ్యంగా" ఉండాలమ్మా అంటూ దీవించిపోతూ ఉంటారు.

ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించే "సంక్రాంతి" పండుగను వైభవంగా జరుపుకుందామా..? మహారాణిలా వచ్చే సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోకి ఆహ్వానం పలుకుదామా...?

Share this Story:

Follow Webdunia telugu