Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు సినీ ఇండస్ట్రీ 2012 జనవరి టు 2012 డిసెంబరు.. ఏం జరిగింది?

తెలుగు సినీ ఇండస్ట్రీ 2012 జనవరి టు 2012 డిసెంబరు.. ఏం జరిగింది?
, సోమవారం, 31 డిశెంబరు 2012 (12:47 IST)
పెద్ద చిత్రాలు పేలిపోతే.. చిన్న చిత్రాలు చిందులేశాయ్‌
WD

రాజకీయం, క్రీడా రంగం తర్వాత సినిమా రంగం మనిషికి ముఖ్యమైంది. దైనందిన జీవితంలో ఓ భాగమైంది. నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయేవరకు సినిమా గురించి మాట్లాడడని మనిషి ఉన్నాడంటే ఆశ్చర్యమే. పాట రూపంలోనో మరే రూపంలో సినిమా.. సినిమా.... అందుకే దేశంలో ఎఫ్‌.ఎం. రేడియోలు ఎక్కువైపోయాయి. ట్రావెల్‌లోనూ పాటలు వింటుంటాం. అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం సినిమా. అయితే 2012 సినిమారంగం మిశ్రమ ఫలితాలను అందించింది. ముఖ్యంగా పెద్ద హీరోల చిత్రాలు ఎక్కువ శాతం ఫెయిలయ్యాయి. కొత్తమొహాలతో తెరమీదకు వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అవి ఎలా ఉన్నాయి... అనేది పక్కన పెడితే... ఈ ఏడాది ఒకరకంగా అందరికీ పని కల్పించడంలో తెలుగు ఇండస్ట్రీ సక్సెస్ అయింది.

గత ఏడాది నీరసంగానే గడిచింది. ఎప్పుడైనా విజయం దక్కిందంటే చాలు ఇండస్ట్రీ కళకళాడినట్లుగా భావించేవారు. రెండుమూడేళ్లుగా డబ్బింగ్‌ సినిమాల హవా కొనసాగింది. ఈ ఏడాది మాత్రం గల్లంతైంది. విజయ్‌ నటించిన 'తుపాకి' చిత్రం సక్సెస్‌తో గట్టెక్కింది. అంతకుముందు 3 ఇడియట్స్‌ తెలుగులో విజయ్‌తో తీసినా ఫలితం లేకుండా పోయింది. హీరోయిన్లు హవా కూడా పెరిగింది. కాజల్‌, తమన్నా వంటివారు హిట్స్‌ కొట్టేశారు. నయనతార సీతగా మార్కులు కొట్టేసింది. అరుంధతి తర్వాత అనుష్కకు అంత హిట్‌ మళ్ళీరాలేదు. ఢమరుకం పేరుతో వచ్చినా అది పెద్దగా ఉపయోగపడలేదు. ఏడాది రకరకాలుగా చిత్రాలు విడులయ్యాయి. వాటిలో విజయాలు ఎంత.. దర్శకులు ఎలా తీశారు? ఇండస్ట్రీ ఏమంటుందో... చిన్న చమక్కులతో చదువుకుందాం.

జనవరి
ఈ నెల 6వ తేదీతో తొలిచిత్రంగా వీరు కె. దర్శకత్వంలో రూపొందిన 'కంపెనీ' విడుదలైంది. నిర్మాతలు కంపెనీ మూసేలా చేసింది. యూత్‌ టార్గెట్‌లో బ్యాచిలర్‌-2 విడుదలైంది. అంతగా ఆకట్టుకోలేదు. 'ప్లే' అనే సినిమా అడ్రస్‌ లేకుండా పోయింది. అటువంటి టైమ్‌లో మహేష్ బాబు 'బిజినెస్‌మేన్‌'తో పూరీజగన్నాథ్‌తో ముందుకువచ్చాడు. పెద్ద హిట్‌కొట్టాడు. రౌడీయిజాన్ని కూడా ఎలా బిజినెస్‌గా మార్చవచ్చనే కొత్త కాన్సెఫ్ట్‌ను రుచిచూపించాడు. వెంకటేష్‌ ఈసారి 'బాడీగార్డ్‌' అనే రీమేక్‌ చేశాడు కానీ అది నిర్మాతకు బాడీని మిగిల్చింది. నవగ్రహ చిత్రాల హీరోగా పేరుపొందిన నందమూరి తారకరత్న 'నందీశ్వరుడు'ని తీసుకువచ్చినా జనాలు చూడ్డానికిరాకపోయే. స్వామిజీల బండారాన్ని బయటపెట్టే చిత్రంగా 'అయ్యారే' అంటూ రాజేంద్రప్రసాద్‌ చేసిన ప్రయత్నాన్ని అయ్యోపాపం అన్నారు.

ఫిబ్రవరిలో
విష్ణు, మంజులిక అనే కొత్తజంట 'లవ్‌చేస్తే' మాకేంటని తిప్పికొట్టారు. 'జై తెలంగాణ'తో వచ్చిన ప్రాంతీయవాదాన్ని తెలంగాణాలో బాగానే ఆదరించారు. ఉద్యమాన్ని బాగా క్యాష్‌ చేసుకున్న దర్శకుడిగా ఎన్‌.శంకర్‌ పేరుతెచ్చుకున్నాడు. ఇక మిగిలిన చిత్రాలు రామదండు, మావూరి మహర్షి, రుషి, ధోని.. వీరంగం చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. సిద్దార్థ్‌, అమలాపాల్‌ చేసుకున్న లవ్‌ కాస్త 'లవ్‌ ఫెయిల్యూర్‌' అయింది. సునీల్‌, ఇషాచావ్లాతో అచ్చిరెడ్డి నిర్మించిన 'పూల రంగడు'కు పూలవర్షం కురిపించారు. ఎప్పటినుంచో హిట్‌ కోసం వెతుకుతున్న తెలంగాణా హీరో నితిన్‌కు 'ఇష్క్‌'తో మొహబత్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత 'టెన్త్‌క్లాస్‌' అంటూ పిల్లలతో సినిమా తీసి క్యాష్‌ చేసుకోవాలనుకున్న దర్శకుడు బి.ఎస్‌.రాజుకు పదిమంది జనాలు కూడా రాకుండా బుద్ధిచెప్పారు. రెండోరోజు సినిమా థియేటర్లలో లేపాల్సి వచ్చింది.

నీకు అంత దమ్ము ఉందా...?
webdunia
WD

మార్చి
మంచు మనోజ్‌ ఏడాదిపాటు చేసిన సినిమా 'మిస్టర్‌ నూకయ్య'కు మీ పైత్యం మామీద నూకకయ్యా అంటూ తీర్పుచెప్పారు. నోకియా పోన్లను ఇన్‌స్టాల్ చేసినందుకు నోకియా కంపెనీ నుంచి నోటీసుల కూడా అందుకున్నాడు. రచయిత సతీష్‌ దర్శకుడిగా మారి లోబడ్జెట్‌తో తీసిన 'కులుమనాలి'ని చూడ్డానికి జనాలు సాహసించలేదు. గతంలో టెన్త్‌క్లాస్‌ తీసిన దర్శకుడు చందు ఈసారి 'మా ఊళ్ళో ఓసారి ఏమి జరిగిందంటే' అంటూ ముందుకు వస్తే.. చూడ్డానికి ఎవరూలేకపోయే. అల్లరినరేష్‌, శర్వానంద్‌, శ్రియ కాంబినేషన్‌లో 'నువ్వానేనా' అంటూ పోటీపడితే ఆమె ఎవరికీ దగ్గకుండా పోయింది. రాణా, జెనీలియా నటించి 'నా ఇష్టం' అంటే మీఇష్టం మీరే చూసుకోండని అన్నారు. దర్శకురాలు జయ దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌లీ'కి మంచి స్పందనే వచ్చింది. కానీ పెట్టిన పెట్టుబడి అంతగా రాబట్టలేకపోయింది. ఏడాది నాటి నుంచి ఆర్యన్‌రాజేష్‌, శ్రీహరి చిత్రం రెండుసార్లు పేరుమార్చి మూడోసారిగా 'బాలరాజు ఆడి బామ్మర్ది' అంటూ వచ్చినా ఎవరూ పలకలేదు.

ఏప్రిల్‌
సంపత్‌నంది దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, తమన్నా చేసిన 'రచ్చ'కు జనాలు రచ్చచేసి కలెక్షన్లు కురిపించారు. యూత్‌ చిత్రాలతో ముందుకు వచ్చిన దర్శకుడు తేజ పేరు మార్చుకుని ధర్మతేజగా వచ్చి 'నీకు నాకు డాష్‌ డాష్‌' అంటూ కొత్తవారితో అనిపిస్తే.. ఇదేదో బూతు సినిమా అని జనాలు రాకుండాపోయారు. దాంతో 'డాష్‌ డాష్‌' తీసేయాల్సి వచ్చింది. అప్పటికే నిర్మాతకు నష్టం జరిగి పోయింది. రచయిత, దర్శకుడు జనార్దన మహర్షి అచ్చమైన తెలుగు చిత్రం చేసి 'దేవస్థానం' విశిష్టతను చాటాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్‌.పి.పట్నాయక్‌ దర్వకత్వలో వచ్చిన 'ఫ్రెండ్స్‌బుక్‌' గురించి జనాలకు అర్థంకాలేదు. నిఖిల్‌ ఈసారి 'డిస్కో- ఆడతాడు.. ఆడిస్తాడు..' అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చినా.. చూసేందుకు తీరికలేదన్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత నెలాఖరులో తన 'దమ్ము' చూపిస్తానని ఎన్‌.టి.ఆర్‌. ముందుకు వచ్చాడు. అయితే బోయపాటికి ఆ దమ్ము లేదని తీర్పు చెప్పారు.

రికార్డులు బద్దలు కొట్టిన గబ్బర్ సింగ్
webdunia
WD

మేల
ఎప్పటి నుంచో పవన్‌కళ్యాణ్‌ సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే పరమేశ్వర అంటూ బేనర్‌తో చేసిన 'గబ్బర్‌సింగ్‌'కు ఆయన ఆశీస్సులు లభించాయి. ఊహించని విజయం సాధించడంతో గత తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టే దిశగా ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఆ తర్వాత రవితేజ తానుకూడా ఉన్నానంటూ 'దరువు' వేస్తే నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణకు పెద్దబరువుగా మారింది. ఇక నటుడు చరణ్‌రాజ్‌ దర్శకుడిగామారి... అప్పట్లో ఫేమస్‌ అయిన ఓ సాంగ్‌ ఆధారంతో సినిమా తీసి 'యదార్థ ప్రేమకథ' అంటూ చెపితే వినడానికి శ్రోతలు లేకుండాపోయారు.

జూన్‌
నందమూరి వంశం బాలకృష్ణ తానే 'అధినాయకుడు' అని నిరూపించుకోలేకపోయాడు. దర్శకుడు కరుణాకర్‌ ఈసారి రామ్‌, తమన్నాలతో 'ఎందుకంటే ప్రేమంటే..' అని చెబితే.. నువ్వే ఎందుకంటే.. అంటున్నావని వద్దన్నారు. గంగపుత్రులు వంటి అవార్డులు చిత్రాలు తీస్తూ తనకంటూ ఒక శైలి ఉందని గ్రహించిన పి.సునీల్‌ కుమార్‌రెడ్డి దర్శక నిర్మాతగా 'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌కథ' చేసి యూత్‌ను బూతుతో ఆకట్టుకుని సొమ్ము చేసుకున్నాడు. తనీష్‌, నీతిటైలర్‌లు 'మేం వయస్సుకు వచ్చాం' అంటే ఇది కామనే కదా అనుకున్నారు. తమిళ తెలుగు నటుడు కార్తీ చేసిన కొత్త ప్రయత్నం 'శకుని' పాచిక పారలేదు. 'ఆల్‌ ది బెస్ట్‌' అంటూ శ్రీకాంత్‌, జెడి.చక్రవర్తిలు చెబితే.. ప్రేక్షకులు థ్యాంక్స్‌ చెప్పారు.

ఈగ కోసం ఎగబడ్డ ప్రేక్షకులు
webdunia
WD

జులై
రాజమౌళి కొత్తప్రయోగంతో నాని, సమంతాతో 'ఈగ'ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అదే టైంలో వచ్చిన ఎం.ఎస్‌.రాజు తనయుడు సుమంత్‌ను 'తూనీగా తూనీగ' అంటే రెండో రోజే తోలేశారు. రాజేంద్రప్రసాద్‌తో క్రాంతిమాధవ్‌ అనే దర్శకుడు 'ఓనమాలు' దిద్దిస్తే... చిన్నతనంలో తాము దిద్దినట్లుందని ప్రశంసలు కురిపించారు. మల్టీస్టారర్‌గా బాలకృష్ణతో, మనోజ్‌తో కలిసి లక్ష్మీప్రసన్న 'ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా' అంటే ఒక్కరూ ఉలిక్కిపడలేదు.

ఆగస్టులో
వారాహి సినిమా బేనర్‌ఫై రాజమౌళి నిర్మాతగా 'అందాల రాక్షసి' తీస్తే... ఇదేదో కొత్తగా ఉన్నట్లు అనిపించినా చూడ్డానికి జనాలు పెద్దగా రాలేకపోయారు. మాస్‌ హీరోగా పేరుపొందిన రవితేజ, ఇలియానాతో 'దేవుడు చేసిన మనుషులు' అంటూ పూరీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నగరంలో వినాయకుడు, సినిమాకెళ్దాం రండి, సూపర్ స్టార్‌ అంటూ చిత్రాలు వచ్చినా లాభంలేకపోయింది. ఆ టైమ్‌లో అల్లరి నరేష్ 'సుడిగాడు'లా విజృంభించాడు. సినిమారంగంపై సెటైర్లతో ఇదేదో ఒరకమైన పిచ్చ సినిమాగా చూశారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు రెండో పంచ్...
webdunia
WD

సెప్టెంబర్‌
మళ్ళీ నందమూరి బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ'ను వేడుకున్నా కరుణించలేదు. సరే తనకైనా 'షిర్డిసాయి' కరుణ దొరుకుతుందని ఆశించిన నాగార్జునకు రాఘవేంద్రరావుకు చుక్కెదురైంది. ఎర్ర ఎర్ర చిత్రాలు తీసే నారాయణమూర్తి 'పీపుల్స్‌వార్‌' అంటే అత్తెసరు మార్కులు వేసి పంపారు. హ్యాపీడేస్‌లాంటి సినిమా తీసిన శేఖర్‌కమ్ముల ఈసారి 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' అని వస్తే.. ఇదేదో హ్యాపీడేస్‌లోనే చూశాం కదా అన్నారు. వెన్నెల కిషోర్‌ చేసిన 'వెన్నెల ఒకట్నిర'కు అరమార్కు వేశారు. శివాజీ 'ఏంబాబూ లడ్డూ కావాలా' అంటే తిరిగి అదే ప్రేక్షకులు ఆయన్ని అడిగారు. నటుడు, దర్శకుడు రవిబాబు చేసిన కొత్త ప్రయోగం 'అవును'కు జనాలు ఊకొట్టారు. బాగానే ఉందన్నారు. ప్రభాస్‌ను 'రెబల్‌'గా చూపించే ప్రయత్నంలో దర్శకుడు లారెన్స్‌ నిర్మాతకు రెబల్‌గా మారాడు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తనను మోసం చేశాడని నిర్మాత కేసు కూడా పెట్టాల్సి వచ్చింది.

అక్టోబర్‌
హిట్‌ లేని జగపతిబాబు తనకుతోడు విక్రమ్‌ను తీసుకుని 'శివతాండం' చేస్తే జనాలు చూడలేకపోయారు. మధ్యలో 'సారీ టీచర్‌' అంటూ ముందుకు వస్తే.. స్టూడెంట్స్‌ కూడా రాలేకపోయారు. చంద్రసిద్దార్థ థియేటర్లను 'హౌస్‌ఫుల్‌' చేద్దామని చేయలేకపోయాడు. ఇక ఐదు చిత్రాలు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయాయి. అటువంటి టైమ్‌లో పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ 'కెమెరామెన్‌ గంతో రాంబాబు' అంటూ వస్తే.. మొదట్లో బాగానే రిసీవ్‌ చేసుకున్నారు. కానీ ప్రాంతీయవాదం చొప్పించారని తెలంగాణాను కించపరిచారని వివాదం రావడంతో నిర్మాతకు నష్టం ఏర్పడింది. ఏడాదిన్నర నుంచి మంచు విష్ణు 'దేనికైనా రెడీ' అంటే... జనాలు చూడ్డానికి సిద్ధపడ్డారు. కానీ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయని గొడవ చేయడంతో మోహన్‌బాబు నేను కూడా దేనికైనా రెడీ అంటూ కోర్టు వరకు వెళ్ళాడు.

రానా కృష్ణమ్ వందే జగద్గురుమ్ అన్నప్పటికీ...
webdunia
WD

నవంబర్‌లో
యూత్‌ చిత్రాల పేరుతో వచ్చిన మరో బూతు చిత్రం బస్టాప్‌ (లవర్స్‌ అడ్డా). దీన్ని చూడ్డానికి యువత బాగానే వచ్చారు. నాగార్జున ఈసారైన విజయంతో 'ఢమరుకం' మోగించాలని చూశాడు. కానీ బడ్జెట్‌ పెరగడం. విడుదల ముందు గొడవ జరగడంతో... బాక్స్‌లు ఆలస్యంగా వెళ్ళడంతో ఢమరుకం పెద్దగా మోగలేకపోయింది. రానా మళ్ళీ 'కృష్ణం వందే జగద్గురుమ్‌' అంటూ వస్తే ఈసారి జనాలు చూశారు. తనీష్‌ తాను 'చాణుక్యుడు' అన్నా జనాలు పట్టించుకోలేదు.

డిసెంబర్‌లో
ఈనెలలో పెద్దగా సక్సెస్‌ లేదనే చెప్పాలి. స్టూడెంట్‌స్టార్‌ నుంచి ఓ ఆంటీ కథవరకు 12 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ పోయాయనే చెప్పాలి. చివర్లో విడుదలైన నరేష్‌ 'యముడికి మొగుడు' మాస్‌ను బాగా ఆకట్టుకుంది. యువత తల్లిదండ్రుల్ని ప్రేమించండి... ఓ హీరోనో, ఓ నాయకుడినో, ఓ క్రికెట్‌రో కాదని చెప్పిన సందేశం 'జీనియస్‌'లో పండింది. అయితే ఆ చిత్రానికి హీరో హవీష్‌, దర్శకుడు ఓంకార్‌ మైనస్‌గా చెప్పుకున్నారు. శర్వానంద్‌ సక్సెస్‌ కోసం స్వంత బేనర్‌ స్థాపించిన 'కో అంటే కోటి' అంటే అదేమిటో అర్థంకాక జనాలు గందరగోళపడాల్సివచ్చింది.

అయితే, 2013లో అయినా అచ్చమైన తెలుగు చిత్రాలు వస్తాయనీ... తెలుగు సంప్రదాయాల్ని మంటగలిపే ద్వందార్థ చిత్రాలు, బూతు చిత్రాలు తీయకుండా నిర్మాతలు జాగ్రత్తపడాలని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేక్షకులు కూడా మారారు. ఎప్పుడూ ఒకే తరహా చిత్రాలు తీసినా చూడరని కొన్నిసార్లు నిరూపించారు. అందుకే ఈసారైనా మంచి చిత్రాలు దర్శక నిర్మాతలు తీయాలని ఆశిద్దాం. గ్రాండ్ వెల్కమ్ అండ్ హ్యాపీడేస్ టు సినీ ఇండస్ట్రీ ఇన్ 2013

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu