Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2011 రౌండప్ : ప్రజాస్వామ్య హక్కును చాటుకున్న ప్రజలు

2011 రౌండప్ : ప్రజాస్వామ్య హక్కును చాటుకున్న ప్రజలు
, మంగళవారం, 27 డిశెంబరు 2011 (13:25 IST)
కొన్ని రోజుల్లో 2011 సంవత్సరానికి వీడ్కోలు పలుకనున్నాం. ఈ యేడాదిలో అంతర్జాతీయ యవనికపై అనేక చేదు, తీపి సంఘటనులు చోటు చేసుకున్నాయి. అనేక దేశాలను దశాబ్దాలుగా తమ గుప్పెట్లో పెట్టుకుని పాలించిన నియంతల్లో కొందరు తెరమరుగు కాగా, మరికొందరు కనుమరుగయ్యారు. ముక్కుసూటిగా చెప్పాలంటే.. దశాబ్దాల అణిచివేతపై ప్రజలు తిరుగుబాటు చేసి తమ ప్రజాస్వామ్య హక్కును చాటుకున్న సంవత్సరంగా చెప్పుకోవచ్చు. నియంతను నువ్వెంత అంటూ నిలదీసిన చారిత్రక సంవత్సరంగా భావింవవచ్చు. ఈజిప్టు, సిరియా, మైన్మార్, లిబియాలో ఇలా అనేక దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ఈ ఏడాది మొదట్లో ఈజిప్టులో ఆరంభమైన ప్రజా తిరుగుబాటు అంతిమంగా ఆ దేశాధ్యక్షుడు, తిరుగులేని నియంత హోస్ని ముబారక్ అధికారానికి చరమగీతం పాడేలా చేసింది. తనమాటే వేదంగా, శాసనంగా ఈజిప్టును తన గుప్పిట పట్టి పాలన సాగించిన ముబారక్ ఆ దేశ ప్రజల ఆగ్రహం ముందు తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆయన అధికార పీఠం నుంచి గద్దె దిగాల్సి వచ్చింది.

లిబియా అంటే గడాఫీ. నియంతృత్వానికి, నిరంకుశ విధానాలకు అవధులు దాటిన అధికార దర్పానికి ప్రతిరూపం ఆయన. ఆడంబరం, అరాచకం విధానాలు సహించి సహించి విసిగి వేశారిన ప్రజలు తిరుగుబాటుతో నీరుగారిపోయాయి. రాజరిక దర్పంతో, అనంతమైన సంపదతో లిబియాను శాసించి పాలించిన గడాఫీ దిక్కూమొక్కూ లేకుండా ఓ కలుగులో దాక్కొని చివరకు తాను పాలించిన పౌరుల చేతిలోనే అత్యంత క్రూరంగా హతమయ్యారు.

ముబారక్, గడాఫీల తరహాలో సిరియాను నియంతృత్వ విధానాలతో అణగదొక్కేందుకు ఆ దేశాధ్యక్షుడు అసాద్ ప్రయత్నించారు. అయితే, ప్రజల తిరుగుబాటు ముందు ఆయన పరిస్థితి కూడా చివరకు దయనీయంగా మారింది. కానీ చివర్లో కొంత విజ్ఞతతో వ్యవహరించటం వల్ల అధోగతి పాలుకాకుండా తప్పించుకోగలిగారు. అంతర్జాతీయ సమాజం జోక్యంతో సిరియా ఇప్పుడిపుడే గాడిన పడుతోంది.

ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలను కూల్చేసి సరికొత్త పాలనా రీతులకు అంకురార్పణ చేస్తే ముగ్గురు మహిళామణులు అహింసాయుత పోరాటంతో ఔరా అనిపించారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని పంచుకున్న లిబేరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్, లిబేరియా హక్కుల కార్యకర్త రెమా గోవీ, యెమన్ పోరాట యోధురాలు తవక్కొల్ కర్మన్‌లు మహిళా శక్తికి, పోరాటయుక్తికి నిదర్శనాలుగా నిలిచారు. ఎన్నో విధాలుగా అవరోధాలు ఎదురైనా వాటికి ఎదురొడ్డి నిరుపమాన దీక్షతో అనుకున్నది సాధించారు. అహింసాయుకంగానే తమతమ దేశాల పాలకుల కళ్లు తెరిపించారు.

ఇకపోతే.. అనేక దేశాలను వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. దశాబ్దాల అమెరికా వేట ఫలించి మే నెల రెండో తేదీన హతమయ్యాడు. ఎంతో మంది ప్రాణాలు తీసిన లాడెన్‌.. చనిపోయిన తర్వాత శవం కూడా కంటికి కనిపించకుండా అమెరికా సీల్స్ దళాలు సముద్రంలోని జీవచరాలకు ఆహారంగా వేశాయి.

మరోవైపు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎలిజిబెత్ టేలర్ మృతి తీరని లోటైతే, టెక్నాలజీ రంగాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించి ఆపిల్ సంస్థను కొత్త పుంతలు తొక్కించిన స్టీవ్ జాబ్స్ మరణం టెక్నాలజీ పురోగతికి అవరోధంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థను గుప్పిటపట్టి స్వార్థంతో కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న అరాచకాలకు ఆక్యుపై వాల్‌స్ట్రీట్ సరికొత్త ఉద్యమస్ఫూర్తిని అందించింది.

ఈ ఏడాది అత్యంత సంచలనాత్మక అంశాల్లో న్యూస్ హ్యాకింగ్ ఒకటి. బ్రిటన్ బాలిక మిల్లీ డాలర్ అదృశ్యంపై మీడియా సామ్రాట్ రూపర్ట్ ముర్డోక్ సారథ్యంలోని న్యూస్ ఆఫ్ ది వరల్డ్ సృష్టించిన హ్యాకింగ్ నాటకం విలువల పతనానికి అద్దం పట్టింది. చనిపోయిన బాలిక బతికే ఉన్నట్టుగా సాగిన ఫోన్ హ్యాకింగ్ నాటకం అంతిమంగా బయట పడటంతో ఆ పత్రిక మూత పడింది. రూపర్డ్ ముర్డోక్ ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పడమే కాదు భారీ పరిమాణంలో నష్ట పరిహారాన్నీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

అధికార స్థాయిలో జరిగే సంభాషణల కేబుల్స్‌ను లీక్ చేయడం ద్వారా జూలియన్ అసాంజే సంచలనం సృష్టించాడు. అనేక ప్రభుత్వాల పునాదుల్నే కుదిపేశాడు. అసలు ఎప్పటికీ వెలుగు చూడవనుకున్న రహస్యాలను సైతం తన సంస్థ యూఎస్ కేబుల్స్ వికీ లీక్స్ పేరుతో బట్టబయలు చేసి సర్వత్రా గుబులు పుట్టించాడు.

ఇక.. ప్రకృతి విలయాల మాటకొస్తే జపాన్ భూకంపం పెను ప్రకంపనలు సృష్టించింది. మరోసారి చెర్నోబిల్ భయాన్ని తెరపైన ఆవిష్కరింపజేసింది. ఇలా 2011 అనేక చారిత్రక ఘటనలకు, దిగ్భ్రాంతికర సంఘటనలకు, మరచిపోలేని ఆవిష్కరణలకు, మలుపుతిప్పిన చారిత్రాత్మక ఉదంతాలకు శ్రీకరనామ సంవత్సరం గుర్తుగా నిలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu