Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మతాలకతీతంగా అమీన్‌పీర్ దర్గా

మతాలకతీతంగా అమీన్‌పీర్ దర్గా
, మంగళవారం, 29 జులై 2008 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కేంద్రమైన కడపలో ఉన్న అమీన్‌పీర్ దర్గా మాతాలకతీతంగా ప్రఖ్యాతి చెందింది. ఈ దర్గాను సందర్శించడానికి దేశ, విదేశాలనుంచి భక్తులు తరలివస్తుంటారు. దర్గాను ముస్లీంలు నిర్వహిస్తున్నా ఇక్కడకు హిందూ, క్రైస్తవులు సైతం వేలాదిగా రావడం విశేషం.

ఈ దర్గాకు పీఠాధిపతిగా వ్యవహరించే వారి చేతితో ఇచ్చే విభూది తీర్థాన్ని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

దర్గా చరిత్ర
కర్ణాటకా ప్రాంతానికి చెందిన పీరుల్లా హుసేనీ అని పిలవబడే సాహెబ్ దాదాపు 1683 ప్రాంతంలో కడపకు చేరుకున్నారు. నిరాడంబురులైన సాహెబ్ దైవాంశ సంభూతులని ప్రసిద్ధి. అంతేకాక ఈయన ముస్లీం మత ప్రవక్త మహ్మద్ వంశీయులు కావడం గమనార్హం.

కడపకు విచ్చేసిన ఈయన అక్కడే కొంతకాలం జీవించి అక్కడే జీవసమాధి అయ్యారు. అలా పీరుల్లా హుసేనీ సమాధి అయిన ప్రేదేశంలో వెలసినదే ఈ అమీన్‌పీర్ దర్గా. స్థానికులు దీనిని పెద్ద దర్గా అని పిలుస్తుంటారు. ఈ దర్గా నిర్మించబడిన నాటి నుంచి నేటివరకు పీరుల్లా హుసేన్ వంశానికి చెందిన పెద్ద కుమారులు దర్గాకు పీఠాధిపతులుగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది.


ఆ క్రమంలో ప్రస్తుతం ఆ తరానికి చెందిన ఆరీపుల్లా హుసేనీ 11వ పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ఈయన తన 11వ యేటే దర్గా పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు.

దర్గాలో నిర్వహించే వివిధ ఉత్సవాలు
ఈ దర్గాలో అన్ని రకాల దర్గాలు కలిసి 18 దర్గాలున్నాయి. దాదాపు ప్రతినెలా ఇక్కడ గంథం, ఉరుసు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడుతాయి. అయితే ఏడాదిలో ఐదుసార్లు జరిగే ఉరుసు ఉత్సవాలు అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ ఉరుసు ఉత్సవాలకు విదేశాలనుంచి సైతం భక్తులు విచ్చేస్తుంటారు.

ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే ఈ ఉరుసు ఉత్సవాలకు ఆర్ధికసాయం అందించడం విశేషం. పాకిస్థాన్, గల్ఫ్ దేశాల్లోనూ సైతం ఈ దర్గాను విశ్వసించే భక్తులు ఉన్నారు. వీరితోపాటు దేశంలోని చాలామంది వీఐపీలు ఈ దర్గాను సందర్శించి తమ మొక్కులు చెల్లించడం విశేషం.

భారత ప్రధానులైన ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావులు ఈ దర్గాను సందర్శించి పూజలు నిర్వహించారు. అలాగే ఇతర నేతలైన సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి లాంటివారూ సందర్శించుకున్నారు. అలాగే సినీ ప్రపంచానికి చెందిన మహ్మద్ రఫీ, ఎఆర్ రెహ్మాన్, అభిషేక్ బచ్చన్, ఆయన భార్య, ప్రపంచసుందరి అయిన ఐశ్వర్యారాయ్ లాంటి తారలు సైతం దర్గాను సందర్శించి పూజలు నిర్వహించడం విశేషం.

ఉరుసు నిర్వహణ సమయంలో అన్ని మతాలకు చెందినవారు ఇక్కడ జతకూడడంతో ఈ దర్గా మతాలకతీతంగా విలసిల్లుతోంది.

రవాణా, సౌకర్యాలు
కడపకు చేరుకోవడం ద్వారా ఈ దర్గాను సందర్శించవచ్చు. ఉరుసు, గంథోత్సవాలు నిర్వహించే సమయంలో దర్గా నిర్వాహుకులే భక్తులకు భోజన సదుపాయాలు సమకూరుస్తున్నారు. అలాగే కడప జిల్లా కేంద్రం కావడం మూలంగా ఇక్కడ వసతి సౌకర్యాలకు కొదవలేదు.

Share this Story:

Follow Webdunia telugu