Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మావతీ అమ్మవారి క్షేత్రం తిరుచానూరు

పద్మావతీ అమ్మవారి క్షేత్రం తిరుచానూరు
, సోమవారం, 21 జులై 2008 (18:29 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని భార్యగా పూజలందుకునే పద్మావతీ దేవి కొలువైన క్షేత్రం తిరుచానూరు. దీనినే అలిమేలు మంగాపురం అని కూడా పిలుస్తుంటారు. తిరుమలకు వెళ్లిన భక్తులు అమ్మవారి క్షేత్రాన్ని కూడా దర్శించుకుంటుంటారు. తిరుమల పాదాల చెంత ఉన్న తిరుపతి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం నిత్యం రద్దీగా ఉంటుంది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్న దాదాపు ప్రతివారూ తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

క్షేత్ర విశేషాలు
తిరుచానూరులో బస్సు దిగి ఎదురుగా చూస్తే అమ్మవారి ఆలయం కన్పిస్తుంది. ఆలయ ప్రాంగణంలో మరికొందరు దేవతలు సైతం కొలువై యున్నారు. ఆలయం ప్రాంగణంలో భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాతంలో టీటీడీకి సంబంధించి కళ్యాణ మండపాలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన అనేక కళ్యాణ మండపాలు ఉన్నాయి.

మహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుని అవతారంలో వకులమాత వద్ద ఉన్న సమయంలో ఓ రోజు ఎనుగును వెంబడిస్తూ తిరుమలకు సమీపంలో ఉన్న నారాయణపురం అనే ఊరికి చేరుకున్నాడట. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతి వనంలో విహరిస్తుండగా స్వామివారు ఆమెను చూచి వలచి వివాహం చేసుకున్నారట.


అయితే స్వామివారు పద్మావతీ దేవిని తీసుకుని తిరుమలకు పయనమౌచుండగా లక్ష్మీదేవి అడ్డుపడిందట. దీంతో స్వామివారు లక్ష్మీ, పద్మావతీలలో ఎవరి పక్షం వహించలేక ఏడడుగులు వెనక్కు వేసి ఏడుకొండలపై కొలువైయ్యాడట. దీంతో పద్మావతీ దేవి తిరుమలకు కొండకు కిందనే ఉండిపోయారట.

అందుకే స్వామివారు ఎల్లవేలలా తిరుమల్లోనే ఉన్న రాత్రి సమయంలో తిరుచానూరుకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

రవాణా సౌకర్యాలు
తిరుచానూరును దర్శించాలంటే చాలా సులభం. తిరుమలకు వచ్చిన ప్రతివారూ ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణమైన తిరుపతి నుంచి ఈ క్షేత్రం కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్‌ల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఓ బస్సు తిరుచానూరుకు బయలు దేరుతుంది.

ఉదయం నాలుగు గంటల నుంచి అర్థరాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుచానూరులో వసతి సౌకర్యలు తక్కువైన దగ్గర్లోని తిరుపతిలో సౌకర్యాలకు ఏమాత్రం కొదవలేదు.

Share this Story:

Follow Webdunia telugu