Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సృష్టికర్త మాయాజాలం "బ్రహ్మ లింగేశ్వరుడు"

సృష్టికర్త మాయాజాలం
కనుచూపుమేరలో పెద్ద బండ, దానిపై ఆకర్షణీయమైన ఆలయం, అందులో కొలువుదీరిన స్వామివారిని చూడాలంటే... విజయనగరం జిల్లా, వేపాడ మండలం, గుడివాడలోని శైవక్షేత్రానికి తరలి వెళ్లాల్సిందే. సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే ముక్కంటిని ఏకశిలపై ప్రతిష్టించమే ఇక్కడి ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆ సృష్టికర్త చేతులమీదుగా జీవం పోసుకున్న ఈ పుణ్యక్షేత్రం గురించిన మరిన్ని వివరాలను చూద్దామా...?!

గుడివాడ "బ్రహ్మ లింగేశ్వరుడు"గా భక్తుల పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం పైన చెప్పుకున్నట్లుగా ఏకశిలపై రూపుదిద్దుకుంది. పాండవులు వనవాసం చేసే కాలంలో విరాట పర్వతంపై ఉన్నప్పుడు... వారి పూజల కోసం బ్రహ్మదేవుడు గుడివాడ గ్రామంలోగల ఏకశిలపై శివుడి రూపమైన మూడు శివలింగాలను ప్రతిష్టించినట్లుగా భక్తులు విశ్వసిస్తుంటారు.
అప్పన్న ఈ శిలపై కాలుమోపాడట..!
  సింహాద్రి స్వామి మొట్టమొదట ఈ ఏకశిలపై వెలసేందుకు కాలుమోపాడనీ... స్వామి పాదం పాతాళానికి వెళ్లడంతో ఇక్కడినుంచి సింహాచలం తరలివెళ్ళినట్లు భక్తులు విశ్వసిస్తుంటారు.      


అంతేగాకుండా, ఏకశిలపై ప్రతిష్టించిన ఈ స్వామివారికి త్రిలింగేశ్వరుడని, బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్టించినందువలన బ్రహ్మ లింగేశ్వరుడని పేరు వచ్చింది. ప్రాచీన శిల్ప కళా సంపదకు ఆనవాళ్లుగా నిలిచిన ఈ ఆలయాన్ని కొండపైన నిర్మించటం వలన ప్రకృతి అందాలు భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి.

1516-1816 సంవత్సర కాలాల మధ్య ఈ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాతత్త్వశాఖవారి అంచనా. ఆలయం గోడలపై ఉన్న శిల్పకళా సంపద... విశాఖపట్నానికి దగ్గరలో నెలవైన సింహాచల ఆలయాన్ని పోలి ఉండటం విశేషంగా చెప్పవచ్చు. సింహాద్రి స్వామి మొట్టమొదట ఈ ఏకశిలపై వెలసేందుకు కాలుమోపాడనీ... స్వామి పాదం పాతాళానికి వెళ్లడంతో ఇక్కడినుంచి సింహాచలం తరలివెళ్ళినట్లు భక్తుల కథనం.

తెలుగువారి పండుగలన్నింటితోపాటు మహా శివరాత్రికి బ్రహ్మ లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు. అదే విధంగా కార్తీక మాసంలో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పక్క రాష్ట్రాల నుంచే కాకుండా, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి ముక్కంటిని దర్శించుకుంటే తమ బాధలన్నీ తొలగుతాయని భక్తులు నమ్ముతుంటారు.

ఎలా వెళ్లాలంటే... విజయనగరం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, సోంపురం ఆనందపురం రోడ్డులో ఉండే జగ్గయ్యపేట వద్ద దిగాలి. అక్కడి నుంచి ఓ ఐదు కిలోమీటర్ల దూరం నడిస్తే, కొండమీది ఆలయానికి చేరుకోవచ్చు. వేపాడ, వల్లంపూడి ప్రాంతాలలో దిగినా ఐదు కిలోమీటర్ల దూరం మాత్రం తప్పకుండా నడవాల్సి ఉంటుంది. ఇకపోతే... ఈ ఆలయం వద్ద ప్రత్యేకించి బస సౌకర్యాలేమీ ఉండవు కాబట్టి, దర్శనం తరువాత దిగివచ్చి, విజయనగరంలోనే బస చేయాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu