Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివయ్య లింగరూపంలో వెలసిన "పుణ్యగిరి"

శివయ్య లింగరూపంలో వెలసిన
చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి, వెరసి భక్తుల మదిని పులకింపజేసేదే "పుణ్యగిరి" దేవాలయం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని భక్త జనులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.

దక్షిణ కాశీగా పిలవబడుతూ, భక్తుల చేత నిత్యపూజలందుకుంటున్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో పూర్వం... ఋషులు తపస్సు చేసి, ఆ పరమశివుడి సాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివయ్య లింగరూపంలో వెలశాడని పూర్వీకుల కథనం.

పుణ్యగిరి గురించి మరో కథనం కూడా ఉంది. అదేంటంటే... మహా భారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో, పుణ్యగిరి కొండపై గల విరాటరాజు కోటలో తలదాచుకున్నారట. ఆ సమయంలో వారు ఇక్కడ పుట్టద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుడిని పూజించేవారట.

కాబట్టి... ఇంతటి పవిత్ర స్థలంలో స్నానమాచరించి ఆ పరమశివుడిని దర్శించుకుంటే సర్వపాపాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి పర్వదినాన పుణ్యగిరిలో జాగారం చేసి, ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నేరుగా కైలాసం ప్రాప్తిస్తుందని భక్త జనులు గట్టిగా నమ్ముతుంటారు.

ఉమా కోటిలింగేశ్వర ఆలయం వెలసిన ప్రాంతంలో కోటిలింగాలు, త్రినాథ గుహ, దార గంగమ్మ పుణ్య జలపాతాలను విశేషంగా చెప్పవచ్చు. అంతేగాకుండా... ఆలయం చుట్టూ ఎత్తయిన కొండలు, మధ్యలో జలపాతాల హోరు, అడుగడుగునా కనిపించే పచ్చగా పరచుకున్న ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

హిందూ సంప్రదాయ పండుగలతో పాటు శివరాత్రి పర్వదినాన్ని పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రికి తొమ్మిదిరోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి మూడు రోజుల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఈ ఉత్సవాలకు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

వసతి, రవాణా సౌకర్యాల విషయానికి వస్తే... విశాఖపట్నం-అరకు మధ్యలో నెలవై ఉన్న ఈ పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమైన అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. నడవలేనివారు బస్టాండు నుంచి ఆటోలలో కూడా వెళ్ళవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu