Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల్లన్న దివ్య సన్నిధి కొమురవెల్లి క్షేత్రం

మల్లన్న దివ్య సన్నిధి కొమురవెల్లి క్షేత్రం
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో కొమురవెల్లి మల్లన్న దేవాలయం ఒకటి. మల్లికార్జునుడి పేరుతో ఈ క్షేత్రంలో కొలువైన శివుడు తన నిజరూప దర్శనంతో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు.

వరంగల్ జిల్లాలోని చేర్యాల మండలంలో గల కొమురవెల్లి గ్రామంలోని ఇంద్రకీలాగ్రి కొండపై వెలసిన ఈ మల్లన్న కోరిన కోర్కెలు తీర్చడంలో భక్తుల పక్షపాతిగా వ్యవహరిస్తాడనే కథలు ప్రచారంలో ఉన్నాయి.

క్షేత్ర చరిత్ర
దాదాపు పదకొండో శతాబ్ధంలో ఈ కొమరవెల్లి గ్రామంలో శివుడు మల్లికార్జునుడి రూపంలో స్వయంగా వెలిసినట్టు భక్తుల విశ్వాసం. ఆ రోజుల్లో ఓ గొర్రెలకాపరి కలలో ప్రత్యక్షమైన స్వామివారు తాను కొండపై కొలువై ఉన్నానని తెలిపారట. దాంతో స్వామివారి విగ్రహాన్ని గుర్తించిన గొర్రెల కాపరి స్వయంగా గుడి కట్టించాడట.

ఇక్కడ కొలువైన స్వామివారు ఆ ప్రాంతంలోని యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ, లింగబలిజ కులానికి చెందిన మేడలమ్మ అనేవారిని వివాహామాడారట. అందుకే ఈ క్షేత్రంలో స్వామివారి పక్కన వారి విగ్రహాలు సైతం కొలువై ఉంటాయి. ఈ కారణంగానే ఇక్కడ పూజాది కార్యక్రమాలను యాదవ, లింగ బలిజ కులస్థులే నిర్వహిస్తుంటారు.

క్షేత్ర విశేషాలు
దాదాపు 500 ఏళ్ల క్రితం నుంచి కొమరవెల్లి గ్రామంలో ఉన్న క్షేత్రంగా దీనికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. నిజరూపంలో ఇక్కడ కొలువైన స్వామివారి విగ్రహం పుట్ట మట్టితో చేయబడిందిగా చెబుతారు. అన్ని ఏళ్ల క్రితం చేయబడిన ఈ పుట్ట మట్టి విగ్రహం ఇనాటికీ చెక్కు చెదరకపోవడం గొప్ప విశేషంగా భక్తులు భావిస్తారు.

కొద్ది ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయానికి సౌకర్యాల లేమి ఉన్నా ప్రస్తుతం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గుడి వద్దకు చేరుకోవడానికి కొండ కింది ప్రాంతం నుంచి మెట్లు నిర్మించబడ్డాయి. అలాగే ఇక్కడి ఆలయానికి కొద్ది దూరంలో ఓ ఆర్యవైశ్య సత్రం అందుబాటులో ఉంది.

ఈ దేవాలయంలో భక్తులు వివిధ రకాలైన మొక్కులను స్వయంగా చెల్లించుకుంటుంటారు. దేవాలయాన్ని దర్శించి మొక్కులు చెల్లించుకుంటే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని ఈ కొండకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu