Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం ద్వారపూడి

అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం ద్వారపూడి
, బుధవారం, 26 నవంబరు 2008 (16:30 IST)
అయ్యప్పస్వామి దేవాలయం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానమే. ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాలనుంచి దీక్ష పూనిన అయ్యప్పస్వాములు లక్షలాదిగా తరలిరావడం అందరికీ తెలిసిందే.

అయితే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ అయ్యప్పస్వామి ఆలయం ఉండడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాలోని ద్వారపూడిలో గల ఈ అయ్యప్పస్వామి క్షేత్రానికి సైతం భక్తులు లక్షలాదిగా తరలి వస్తుంటారు. అంతేకాదు కేరళలలోని శబరిమల క్షేత్రానికి వెళ్లలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ద్వారపూడి క్షేత్రానికి వచ్చి తమ దీక్షను విరమించడం గమనార్హం.

ద్వారపూడి విశేషాలు
ఒకప్పుడు సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపూడి తర్వాతి కాలంలో అయ్యప్పస్వామి దివ్యక్షేత్రంగా దిన దిన ప్రవర్థమానమవుతోంది. ఈ ఊరిలోని అయ్యప్పస్వామి గుడిలోని విగ్రహన్ని 1989లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ప్రతిష్టింపజేశారు.

అయితే ఇక్కడ ఉన్న అయ్యప్పస్వామి ఆలయానికి 1983లోనే శంకుస్థాపన జరిగింది. స్థానికంగా ఉండే ఓ తమిళ వ్యక్తి తన కోరిక నెరవేర్చినందుకుగాను అయ్యప్పస్వామికి ద్వారపూడిలో దేవాలయాన్ని కట్టేందుకు సంకల్పించారు. ఇలా ద్వారపూడిలోని అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి బీజం పడింది.

సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ హరిహరాదుల దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడి అయ్యప్పస్వామివారి దేవాలయానికి ఉన్న పద్దెనిమిది మెట్లను తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించడం విశేషం.

కేరళలోని శబరిమల ఆలయాన్ని ఎంత భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తారో ద్వారపూడిలోని క్షేత్రాన్ని కూడా అదే విధంగా నిర్వహిస్తారు. అందుకే శబరిమలకు వెళ్లలేని భక్తులు ఇరుముడి కట్టుకుని ద్వారపూడి క్షేత్రాన్ని దర్శిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu