తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. సర్వదర్శనం కింద గంటల పాటు క్యూలైన్లలో వేచి వుండాలి. ఆయన దర్శనం కోసం రూ.300ల టిక్కెట్లను మూడు నెలల ముందే బుక్ చేసుకోవాలి. ఆర్జిత సేవలకు కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో మూడు నెలల ముందే టిక్కెట్లను బుక్ చేసుకుని దర్శించుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్. ఇకపై ఉదయం టికెట్ బుక్ చేసుకుంటే సాయంత్రం శ్రీవారిని దర్శించుకోవచ్చు.
ఎలాగంటే.. శ్రీవాణి ట్రస్ట్ కింద ఉదయం బుక్ చేసుకుంటే.. సాయంత్రం శ్రీవారిని దర్శించుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ అధికారులు రోజూ తిరుమలలోని కౌంటర్, తిరుపతి ఎయిర్ పోర్టులోని శ్రీవాణి కౌంటర్లలో దర్శన టిక్కెట్లను ఆఫ్ లైన్లలో పొందవచ్చు.
ఈ నేపథ్యంలో టీటీడీ కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీ భక్తుల సౌకర్యాల కోసం శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను అందించడంలో ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. ఇప్పటివరకు తిరుమలలో కౌంటర్లలో నేరుగా అందించబడిన ఈ టిక్కెట్లు, ఇకపై ఆన్‌లైన్ ద్వారా పంపిణీకి సంబంధించిన సమాచారం అందించబడింది.
తొలి విడతగా జనవరి 09వ తేదీ మొదటి ఆన్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. దీంతో ఇకపై శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో లభించనున్నాయి. ఈ టిక్కెట్లను ఉదయం బుక్ చేసుకుంటే.. ఆ రోజు సాయంత్రం శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో ఇప్పటివరకు ఆఫ్‌లైన్ కౌంటర్లు ద్వారా అందించబడిన రూ.800 శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లు, ఇకపై ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌గా తిరిగి మార్చబడతాయి.
ఈ టిక్కెట్లు రోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో మొదలవుతాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు అదే రోజున సాయంత్రం నాలుగు గంటలకు తిరుమలలో వెంకన్నను దర్శనం చేసుకోవచ్చు. ఈ కొత్త పద్ధతి జనవరి 9, 2026 నుండి ఒక నెల వరకు పరీక్ష ఆధారంగా అమలు చేయబడుతుంది. దీని ఫలితాలపై ఆధారపడి తదుపరి ఫలితాలు తీసుకోబడతాయి.
ఈ టిక్కెట్లను బుక్ చేయడానికి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరి. ఒక కుటుంబంలో గరిష్టంగా 4 మంది వ్యక్తులు (1+3) మాత్రమే ఒక్కసారి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆచరణలో వున్న 3 నెలల ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే దర్శన టిక్కెట్లతో పాటు అదనంగా ఈ రూ.800 శ్రీవాణి బ్రేక్ దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే తిరుపతి ఎయిర్ పోర్టులో అందజేసే 200 ఆఫ్‌లైన్ టిక్కెట్‌లు సాధారణంగా కొనసాగుతాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేయాలని దేవస్థానం కోరింది.