2025 ఏడాది తిరుపతి శ్రీవారి లడ్డూ విక్రయంలో కొత్త రికార్డు నమోదైంది. గత ఏడాది లడ్డూల విక్రయం 13.52 కోట్ల కొత్త రికార్డులను సాధించింది. అలాగే తిరుమలకు భక్తుల రాక 2.70 కోట్లు పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు కొత్త సంవత్సరాదిన భక్తులు తిరుమలలో పోటెత్తారు. తద్వారా గత ఏడాది శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూల విక్రయం కొత్త రికార్డును నమోదు చేసుకుంది.
ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసిన ప్రకటనలో 2024వ సంవత్సరం 12.15 కోట్లు అమ్ముడుపోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం.. 2025లో పది శాతం పెరిగింది. ఈ క్రమంలో 13.52 కోట్ల మేరకు లడ్డూలను భక్తులు కొనుగోలు చేసారు.
గత డిసెంబర్ 27, 2025వ తేదీన మాత్రమే 5.13 లక్షల లడ్డూలను విక్రయించడం జరిగింది. ఇది గత పదేళ్లలో లేని లడ్డూల విక్రయమని తితిదే వెల్లడించింది. లడ్డూల విక్రయం పెరిగేందుకు భక్తుల సంఖ్య పెరగడమే ప్రధాన కారణం. 2024లో 2.55కోట్లుగా వుండిన భక్తుల రాక, 2025లో 2.70 కోట్లుగా పెరిగింది. భక్తుల సంఖ్య పెరిగినా.. దేవస్థానం వారి సౌకర్యార్థం పలు కార్యక్రమాలను చేపట్టింది. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది.
సాధారణంగా ఒక రోజుకు నాలుగు లక్షల లడ్డూలను తయారు చేస్తారు. బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లడ్డూల తయారీ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒక రోజుకు 8 నుంచి పది లక్షల వరకు లడ్డూలను తయారు చేసి నిల్వ చేస్తారు. దాదాపు 700 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు రెండు షిఫ్టులుగా రేయింబవళ్లు సంప్రదాయబద్ధంగా ఈ లడ్డూలను తయారు చేస్తారు.
పలు వివాదాల తర్వాత గత కొన్ని నెలలుగా శ్రీవారి లడ్డూలలో నాణ్యత, రుచి పెరిగిందని భక్తులు అంటున్నారు. దీంతో లడ్డూల విక్రయం కాస్త పెరిగిందని తితిదే అధికారులు అంటున్నారు.