షెండూర్ని త్రివిక్రమ దేవుని వైభవం

గురువారం, 5 ఫిబ్రవరి 2009 (12:17 IST)
తీర్థయాత్రలో భాగంగా ఈసారి మిమ్మల్ని మహారాష్ట్రలోని త్రివిక్రమ దేవాలయానికి తీసుకువెళుతున్నాం. త్రివిక్రమ ఆలయాన్ని 1744లో సుప్రసిద్ధ సన్యాసులు శ్రీ కడోగి మహరాజ్ నిర్మించారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని షెండూర్ని గ్రామంలో ఖాందేష్ ప్రాంతంలో నెలకొని ఉంది.

ఆలయ ప్రధాన అర్చకులు శాంతారామ్ మహరాజ్ భగత్ చెప్పినదాని ప్రకారం... శ్రీ కడోగి సన్యాసులవారు పాంధర్‌పూర్‌లోని విఠలేశ్వరుని దర్శించుకునేందుకు ఏటా కాలినడకన వెళ్లేవారట. ఒకరోజు స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో సన్యాసులవారి ముందు విఠలేశ్వర స్వామివారు ప్రత్యక్షమయ్యారట.

అనంతరం కడోగి సన్యాసులవారితో తన విగ్రహం షెండూర్ని గ్రామంలోని ఓ నది ఒడ్డున భూమిలో ఉన్నదని చెప్పారట. తన
SriniWD
వాహనమైన వరాహంతోపాటు తన విగ్రహాన్ని వెలికి తీసి శాస్త్రోక్తంగా దేవాలయంలో ప్రతిష్టించమని చెప్పారట. అలా విఠలేశ్వరుడు చెప్పిన ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి.

ఇది జరిగిన తర్వాత కడోగి సన్యాసులవారు నేరుగా తన స్వగ్రామానికి వచ్చి జరిగిన విషయాన్ని తోటి గ్రామస్తులకు తెలిపారట. అయితే ఆయన మాట ఎవరూ నమ్మలేదు. నమ్మకపోవడం అటుంచి... గ్రామస్తులందరూ కలిసి అతనో పిచ్చివాడని గేలి చేయడం మొదలుపెట్టారు. కానీ కడోగి మాత్రం ఎలాగైనా స్వామివారి విగ్రహాన్ని వెలికితీయాలని నిర్ణయించుకున్నాడు.

WDWD
అంతే... నది ఒడ్డుకు వెళ్లి స్వామివారు చెప్పిన ప్రదేశంలో భూమిని తవ్వటం మొదలుపెట్టాడు. ఇలా తవ్వుతుండగానే కొంతదూరంలో వరాహ విగ్రహం బయటపడింది. విగ్రహాన్ని చూసిన గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తాము కూడా స్వామివారి విగ్రహాన్ని వెలికి తీయడానికి తవ్వకాలు మొదలుపెట్టారు. అలా 25 అడుగుల లోతువరకూ తవ్విన పిమ్మట సుమారు నాలుగున్నర అడుగులు ఎత్తున్న స్వామివారి విగ్రహం భక్తులకు దర్శనమిచ్చిందట. ఆ విగ్రహాన్ని భక్తులందరూ కలిసి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు.

అయితే స్వామివారిని వెలికితీసే ప్రక్రియలో గునపంతో తవ్వుతుండగా పొరపాటున విఠలేశ్వరుని విగ్రహం ముక్కుపై గునపపు గాటుపడిందట. దాంతో స్వామివారి విగ్రహం ముక్కు నుంచి రక్తం కారడం మొదలైందట. ఇది మహా అద్భుతమైన విషయమని చెపుతారు. ఈ విగ్రహపు మరో ప్రత్యేకం ఏమిటంటే... విష్ణు, విఠలుడు, బాలాజీ.. ఇలా మూడు రకాలుగా ఈ విగ్రహం గోచరిస్తుంది.

ఈ కారణం చేతనే ఈ విగ్రహానికి త్రివిక్రమ స్వామివారనే పేరు వచ్చింది. అంతేకాదు సమయాన్నిబట్టి ఆ విగ్రహం తన స్వరూపాన్ని మార్చుకుంటుందని భక్తుల విశ్వాసం. విఠలేశ్వరునితోపాటు ఆయన వాహనం వరాహాన్ని కొలిచినవారు పుట్టెడు దుఃఖాల నుంచి విముక్తి పొందగలరు. అంతేకాదు ఎటువంటి సమస్యలనుంచైనా తన భక్తులను దరిచేర్చుతాడు విఠలేశ్వరుడు.
WDWD


కడోగి సన్యాసులవారు ప్రతి ఏడాది కార్తీక శుద్ధ ఏకాదశినాడు త్రివిక్రమ స్వామివారికి రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించేవారు. అలా ఆనాడు ఆయన ప్రారంభించిన రథోత్సవం నేటికీ కొనసాగుతూనే ఉన్నది. సుమారు 25 అడుగులు ఎత్తున్న ఈ రథం 263 ఏళ్లనాటిదని చెపుతారు. అయినా స్వామివారిని ఊరేగించేందుకు ఈ రథం పనిచేస్తూనే ఉంది. ఈ రథోత్సవానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుంటారు.

ఎలా వెళ్లాలి?

రోడ్డు ద్వారా: జల్గోన్ జిల్లాలోని జామ్నర్ పట్టణానికి త్రివిక్రమ ఆలయం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు ద్వారా: జల్గోన్ ప్రధాన రైలు జంక్షన్. ఇక్కడ నుంచి షెండూర్ని గ్రామం సుమారు 45 కిలో మీటర్ల దూరంలో ఉంది.

విమానం ద్వారా: ఔరంగాబాద్ సమీప విమానాశ్రయం. ఔరంగాబాద్ నుంచి షెండూర్ని 125 కిలోమీటర్ల దూరంలో ఉంది.