Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల వెళ్లొచ్చాం గోవిందా....! లడ్డూ ప్రసాదం ఏది గోవిందా...!!

తిరుమల వెళ్లొచ్చాం గోవిందా....! లడ్డూ ప్రసాదం ఏది గోవిందా...!!
, శుక్రవారం, 11 మార్చి 2016 (18:48 IST)
తిరుమల వెంకన్నను లిప్త కాలంపాటు దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు స్వామి వారి ప్రసాదం లడ్డు కోసం క్యూలు కడుతుంటారు. స్వామి వారికి ఏవిధమైన ప్రపంచ ఖ్యాతి ఉందో తిరుమల శ్రీవారి లడ్డూకు కూడా అదే స్థాయి ప్రాముఖ్యత ఉంది. తిరుమల లడ్డూ ప్రాశస్త్యం ఏమిటి.. దానిని ఎలా తయారు చేస్తారు. ఎందుకు తిరుమల లడ్డు అంత రుచిగా ఉంటుంది...
 
ఎంతో అపురూపంగా కళ్లకు అద్దుకుని గోవిందా అంటూ స్వామివారి లడ్డూను ఆరగించే భక్తులు అంతటితో స్వామి దర్శనం పరిపూర్ణం అయిందని భావిస్తారు. తిరుమలకు వెళ్లి వచ్చామని అనగానే ఎవరైనా వారిని అడిగేది లడ్డూ ప్రసాదం తెచ్చారా అనే మాట. అందుకే లడ్డూలను భక్తులకు అందించడంలో తితిదే ప్రత్యేక శ్రద్ధం తీసుకుంటుంది. 
 
తిరుమల శ్రీవారి లడ్డూల చరిత్ర...
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్నకు అత్యంత ప్రీతపాత్రమైన ప్రసాదం లడ్డూకు ఉన్న డిమాండ్ తరతరాలుగా తగ్గడంలేదు. నిత్యం శ్రీవారికి తెల్లవారు జామున పులిహోర, చక్కెర పొంగలి, కదంబం, మినపదోసెలు, దద్దోజనం, నెయ్యి జిలేబి, వడ తదితర ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పల్లవుల కాలం నాటి నుంచే శ్రీవారి ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి. రెండవ దేవరాయ కాలంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన శ్రీవారి ప్రసాదాలాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. శ్రీవారి ప్రసాదాలను మొదటగా తిరుప్పొంగంగా పిలిచేవారు. 1803 నుంచి లడ్డూల అమ్మకాలు మొదలయ్యాయి. అంతకుముందు తీపి బూంది ప్రసాదంగా పంపిణీ చేసేవారు. 1840 నుంచి లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి. 1950 నుంచి లడ్డూల్లో వాడే సరుకుల మోతాదు దిట్టంను నిర్దేశించింది టిటిడి. 
 
ఆనాటి నుండి శ్రీవారి లడ్డూలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. శ్రీవారి ఆలయంలో ఆగ్నేయ దిశలో లడ్డూలు తయారుకావడంతో మరింత ప్రాశస్త్యం వచ్చింది. తొలుత తయారైన లడ్డూలు ఆలయంలోని ప్రసాదాలను పర్యవేక్షించి శ్రీవారి తల్లి వకుళమాతకు నైవేద్యం సమర్పించిన తర్వాత శ్రీవారికి నైవేద్యంగా మొదటి గంట తెల్లవారు జామున 5 గంటలకు నైవేద్యం సమర్పిస్తుంటారు. శ్రీవారికి నిత్యం చాలా రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తున్నా భక్తులకు అందుబాటులో ఉండేది ఒక్క లడ్డూ మాత్రమే. కాస్త పలుకుబడి ఉండే వడ దొరుకుతుంది. ఇంకాస్త ఉంటే శ్రీవారి నేతి జిలేబి దొరుకుతుంది. 
 
కానీ సామాన్యులకు అందుబాటులో ఉండేది శ్రీవారి లడ్డూ మాత్రమే. తిరుమల తిరుపతి వాసులకు మినహాయించి చాలామందికి తెలియని రెండు లడ్డూలు అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూలు. ఆస్థానం లడ్డూ 760 గ్రాముల బరువు ఉంటుంది. ఈ లడ్డూను శ్రీవారి దర్శనానికి వచ్చే గౌరవ అతిథులకు మాత్రమే అందిస్తారు. కళ్యాణోత్సవం లడ్డూ కళ్యాణం చేయించుకున్నవారికి మాత్రమే ఇస్తారు. దీనిలో బాదం, జీడిపప్పు ఎక్కువగా వేస్తారు. 
 
ఇక అందరికీ అందుబాటులో ఉండే శ్రీవారి లడ్డూ 75 గ్రాముల బరువు ఉంటుంది. ఈ లడ్డూ తొలుత 8 అణాల నుంచి కాలక్రమేణా రూ. 2 ఇప్పుడు రూ. 25కి చేరింది. 2009 సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్ లభించింది. దీనితో టిటిడి మాత్రమే శ్రీవారి లడ్డూ తయారీ భాగ్యాన్ని దక్కించుకున్నట్లయింది. ఐతే పూర్వకాలంలో ఉన్న లడ్డూకు ఉన్న తీపి నేడు తగ్గింది. నాణ్యత లోపించింది. 
 
ఎంతో భక్తిభావంతో స్వీకరించే లడ్డూల సైజు రోజుకోరకంగా తగ్గిపోతుంది. అంతేకాదు నాణ్యత కూడా అంతంతమాత్రంగా తయారైందన్న విమర్శలు వినబడుతూనే ఉన్నాయి. ప్రతి వెయ్యి లడ్డూల్లో ఏదో ఒక చెత్త కనిపిస్తుండటం ఇందుకు ఉదాహరణ. గత కొన్ని నెలలుగా గమనిస్తే లడ్డూలలో బొద్దింకలు, బోల్టులు దర్శనమిచ్చి భక్తులను వెక్కిరిస్తున్నాయి. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూలను తయారుచేసే సమయంలో కార్మికులు పరిశుద్ధంగా ఉండకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తితిదే అధికారులు లడ్డూల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. రోజుకు లక్షల్లో భక్తులు తిరుమలేశుని దర్శించుకుంటున్న క్రమంలో చిన్నచిన్న పొరబాట్లు ఉన్నప్పటికీ అవికూడా సరిదిద్దుకుని భక్తుల మదిలో ఏ చిన్న అసంతృప్తి లేకుండా చేస్తే అంతకన్నా ఇంకేం కావాలి గోవిందా...!!

Share this Story:

Follow Webdunia telugu