Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు చనిపోయిన వేళ ఎందుకు నవ్వాడు?

శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు చనిపోయిన వేళ ఎందుకు నవ్వాడు?
, మంగళవారం, 19 ఆగస్టు 2014 (18:52 IST)
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాల్లో ఎంతో సంతోషంగా.. ఆహ్లాదంగా కనిపిస్తాడు. భాగవత కథల్లో శ్రీకృష్ణుడి బాల్యంలో, గోపికలతో చేసిన రాసలీలల్లో శ్రీకృష్ణుడు సంతోషించిన తీరుకు, మహాభారతంలో శ్రీకృష్ణుడు నవ్విన నవ్వుకు తేడా ఉంది. 
 
మహాభారతంలో తాను అమితంగా ప్రేమించే పాండవుల కుమారుల్లో బలాధీశుడైన భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు కర్ణుడి శక్తికి గురై అర్ధరాత్రి రణరంగంలో మరణించినప్పుడు కృష్ణుడు నవ్వాడు. 
 
ద్రోణపర్వంలో కురుక్షేత్ర రంగ ఘట్టంలో శ్రీకృష్ణుడు సంతోషించటానికి ఘటోత్కచుడి మరణం కారణంగా కనిపించింది. తాము ఎంతో అభిమానంగా, ముద్దుగా చూసుకుంటున్న శౌర్యవంతుడైన ఘటోత్కచుడు కర్ణుడు ప్రయోగించిన శక్తికి గురై మరణించాడు. 
 
అప్పుడు పాండవులంతా విపరీతమైన దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. కృష్ణుడు మాత్రం తన పక్కనే ఉన్న అర్జునుడిని కౌగిలించుకొని ఆనందంతో కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. 
 
కృష్ణుడి ప్రవర్తన అందరినీ ఆశ్చర్య పరిచింది. అర్జునుడు కూడా కృష్ణుడిని చూసి ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని అడిగాడు. తామంతా దుఃఖిస్తుంటే అది కృష్ణుడికి సంతోషదాయకం ఎలా అయిందని ప్రశ్నించాడు. అందుకు బదులుగా శ్రీకృష్ణుడు తన ముఖంలో నవ్వు చెరగకుండానే అర్జునుడితో ఇలా అన్నాడు.
 
‘అర్జునా ఘటోత్కచుడి మరణం నాకు నిజంగానే అమితానందం కలిగిస్తోంది. కర్ణుడు ప్రయోగించిన శక్తి అతడిని మట్టుపెట్టకుండా ఉన్నట్లయితే అది నిన్ను దహించివేసేది. ఆ శక్తి కర్ణుడి దగ్గర ఉన్నంతకాలం కర్ణుడిని ఎదిరించి జయించగలవారు మరెవరూ లేరు. 
 
ఇంద్రుడు కర్ణుడి దగ్గర ఉన్న కవచకుండలాలను తెలివిగా స్వీకరించినప్పటికీ యుద్ధంలో ఒక వీరపురుషుడిని సంహరించ గల శక్తి మాత్రం కర్ణుడి దగ్గరే మిగిలిఉంది. ఆ శక్తి అతడి దగ్గర ఉన్నంత కాలం అతడికి తిరుగులేదు. కానీ ఇప్పుడా శక్తి ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. 
 
ఇక కర్ణుడు సులభంగా యుద్ధంలో మరణించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే ఘటోత్కచుడు చిరకాలం జీవించతగిన వాడు కూడా కాదు. అతడు భీముడి కుమారుడైనా దుర్మార్గ వర్తనుడని కృష్ణుడు తెలిపాడు. యుద్ధంలో ఘటోత్కచుడు అలంబుషుడు తదితరులను చంపటానికి ఉపయోగపడ్డాడు. అతడి వల్ల ప్రయోజనం అంతవరకే ఉంది.
 
యజ్ఞాలను ద్వేషించేవాడు, అధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, పాపాత్ముడు అయినవాడు కనుకనే ఘటోత్కచుడు ఇప్పుడిలా మరణించాడు. ఇతడి పాపాలను ఇప్పటి వరకు ఉపేక్షించింది మిమ్ములను దృష్టిలో ఉంచుకునేనని శ్రీ కృష్ణుడు నవ్వుతూ సమాధానమిచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu