Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహంకారం వద్దు.. సీతమ్మను అపహరించడం రావణుడు చేసిన..

అహంకారం వద్దు.. సీతమ్మను అపహరించడం రావణుడు చేసిన..
, బుధవారం, 24 డిశెంబరు 2014 (18:39 IST)
సీతమ్మవారి ఆచూకీ తెలుసుకున్న రాముడు, వానర సైన్యంతో సముద్రంపై వారధిని నిర్మిస్తాడు. రావణుడితో యుద్ధానికి తొందరపడకుండా ఆయన దగ్గరకి 'వాలి' కుమారుడైన అంగదుడిని రాయబారానికి పంపిస్తాడు. అంతకుముందు హనుమంతుడు వచ్చి చేసిన బీభత్సాన్ని మరిచిపోని రావణుడు, అంగదుడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాడు.
 
సీతమ్మవారిని అపహరించడం రావణుడు చేసిన పెద్దతప్పని అంగదుడు చెబుతాడు. ఆయనలా చేయడానికి కారణం రాముడి శక్తిసామర్థ్యాలు తెలియకపోవడమేనని అంటాడు. సీతమ్మవారిని రాముడికి మర్యాదపూర్వకంగా అప్పగించి శరణు కోరడం అన్నివిధాలా మంచిదని చెబుతాడు. అహంభావం ఆపదలో పడేస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలుకుతాడు. 
 
అయినా రావణుడు తన మనసు మార్చుకోకుండా, రాముడి శక్తిసామర్థ్యాలు ఎలాంటివో చూడటానికే తాను సిద్ధంగా ఉన్నానని అంటాడు. రాయబారిగా వచ్చిన తన బలం ఎంతటిదో తెలుసుకుంటే, రాముడి బలపరాక్రమాలను ప్రత్యక్షంగా చూడాలా వద్దా అనేది స్పష్టమవుతుందని అంటాడు అంగదుడు. 
 
తన కాలు కదిల్చి చూడమంటూ స్థిరంగా.. ధృడంగా నిలబడతాడు. ఆస్థానంలోని మహా బలవంతులంతా ఒకరి తరువాత ఒకరిగా అంగదుడి కాలును కదల్చడానికి ప్రయత్నిస్తారు. ఎంతగా ప్రయత్నించినా ఒక్క అంగుళం కూడా ఆయన కాలును కదల్చలేకపోతారు.
 
అంగదుడి బలం చూసిన రావణుడు విస్మయానికి లోనవుతాడు. సామాన్యుడినైన తన కాలునే కదల్చలేకపోయిన వారిని నమ్ముకుని రాముడితో యుద్ధానికి దిగవద్దనీ, ఆయన ఆవేశం అగ్నిపర్వతం వంటిదనీ ... ఆయన మనసు మంచుపర్వతమని చెబుతాడు. శరణు కోరకపోతే మరణం తప్పదని హెచ్చరించి వెళతాడు. అందరి హిత వాక్కులను పెడచెవిన పెట్టిన రావణుడు యుద్ధంలో తన వాళ్లందరినీ పోగొట్టుకుని చివరికి తాను నశిస్తాడు.

Share this Story:

Follow Webdunia telugu