Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామాయణంలో సీత పాత్ర: వేదవతి.. రావణుని ఇంటికి ఎలా వెళ్లింది?

రామాయణంలో సీత పాత్ర: వేదవతి.. రావణుని ఇంటికి ఎలా వెళ్లింది?
, బుధవారం, 21 అక్టోబరు 2015 (10:43 IST)
భూమిని నాగలితో దున్నితే మనం జీవించటానికి కావలసిన ఆహార ధాన్యాలు ఇస్తున్నది. భూమి గుండెల్లో పలుగు దించితే మన గొంతు తడపటానికి నీరును ఇస్తున్నది. భూమి గర్భాన్ని చీలిస్తే మనకు ఖనిజాలను, బంగారాన్ని ఇస్తున్నది. కాని మానవజాతి ప్రతిఫలంగా చేయకూడని పనులు చేసి ఆ భూమిని అవమానిస్తోంది. భూమిని ఎంత కష్టపెట్టినా ఎంతో ఓర్పు, సహనంతో భరిస్తున్నది. చివరికి మనిషి చనిపోయిన తర్వాత అదే భూమిలోనే కలిసిపోతున్నాడు. మనిషి తల్లి గర్భం నుండి పుట్టి మరణించిన తర్వాత భూమాత గర్భంలో కలిసిపోతున్నాడు. అంతటి ఓర్పు, సహనం వున్న భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుంచి ఆవిర్భవించింది... సీత.
 
అలాంటి సీతమ్మ ప్రాధాన్యత రామాయణంలో ఎంతో వున్నది. సీతమ్మతల్లి పతివ్రత. మన పురాణాల్లో చెప్పినట్లుగా పంచ పతివ్రతలలో సీత ఒకరు. వీరినే పంచకన్యలు అని అంటారు. 
 
అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్. 
 
జానకి జననము
మహాభుజములు గల రావణుడు భూమి మీద సంచరించుచు హిమవత్పర్వత ప్రాంతారణ్యమునకు వెళ్ళి అక్కడ దేవతాకన్యవలె ప్రకాశించుచున్న ఒక కన్యకను చూచెను. ఆమె వేదప్రోక్తములైన నియములు పాటించుచు, కృష్ణాజినమును, జటలను ధరించి ఉండెను. ఆ రావణుడు గొప్ప నియమమును అవలంబించి ఉన్న మంచి సౌందర్యముగల, ఆ కన్యను చూడగానే కామమోహములతో నిండిన మనస్సుతో నవ్వుతూ ''మంగళప్రదులారా! ఏమిటి? నీవు నీ యౌవనమునకు విరుద్ధముగా ప్రవర్తించుచున్నావు? నీ ఈ సౌందర్యమునకు విరుద్ధముగా ఇట్టి ప్రవర్తన యుక్తము కాదు కదా! సాటిలేని నీ రూపము పురుషులకు కామోన్మాదమును కలిగించునది. తపస్సు చేయుటకు తగినది కాదు. ఇది లోకప్రసిద్ధమైన నిర్ణయము కదా ఓ! భద్రులారా! నీవు ఎవరిదానవు. నీ భర్త ఎవరు? నిన్ను అనుభవించు పురుషుడు  లోకములో పుణ్యాత్ముడు. నీవీ తపస్సు ఎందుకు చేయుచున్నావు. అడుగుచున్న నాకు అంతా చెప్పుము'' అని అడిగెను.
 
తపోధనురాలైన ఆ కన్య రావణుని మాటలు విని, వానికి యథాశాస్త్రముగా ఆతిథ్యమిచ్చి- ''గొప్ప తేజస్సు కలవాడు, శోభావంతుడు అయిన కుశధ్వజుడనే బ్రహ్మర్షి నా తండ్రి. నిత్యమూ వేదాభ్యాసము చేయు ఆ మహాత్మునకు వేదవాజ్ఞ్మయ స్వరూపిణినైన నేను కన్యగా పుట్టాను. నా పేరు వేదవతి. అప్పుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు నా తండ్రి దగ్గరకు వచ్చి తమకు నన్ను ఇమ్మని అడిగారు. నా తండ్రి నన్ను వాళ్ళకి ఇవ్వలేదు. అందుకు కారణము చెప్పుచున్నాను వినుము. దేవతల ప్రభువు, మూడులోకాలకు అధిపతి అయిన విష్ణువు తన అల్లుడు కావలెనని నా తండ్రికి కోరిక ఉండెను. అందుచే అతడు నన్ను మరెవ్వరికీ ఇచ్చుటకు అంగీకరించలేదు. శంభువు అనే దైత్యరాజు ఇందుకు కోపించెను. 
 
ఆ పాపాత్ముడు నా తండ్రిని రాత్రి నిద్రించుచుండగా చంపివేసెను. పిమ్మట మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలై నా తండ్రి శరీరమును కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించినది. నారాయణుణ్ణి గురించి మా తండ్రికి ఉన్న మనోరథమును సత్యమైన దానిని చేయవలెనని నిశ్చయించుకుని నేను ఆ నారాయణుడినే హృదయములో నిలుపుకుని ఉన్నాను. ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి గొప్ప తపస్సు చేయుచున్నాను. ఈ విషయమంతా నీకు చెప్పాను. నాకు నారాయణుడే భర్త. అతడు తప్ప మరొక్కడెవ్వడూ కాదు. ఆ నారాయణుణ్ణి పొందవలె నను కోరికచేతనే భయంకరమైన నియమమును అవలంబించి ఉన్నాను. రావణా! నిన్ను గూర్చి నాకు తెలియును. ఇంక వెళ్ళుము. మూడులోకములలో ఉన్నది అంతా నాకు తపోబలముచేత తెలియును'' అని చెప్పెను.
 
మన్మథశరీరములచేత పీడింబడిన రావణుడు విమానాగ్రభాగము నుండి దిగి, గొప్ప తపస్సు చేయుచున్న ఆ కన్యతో మరల- ''ఓ! సుశ్రోణీ! ఇట్టి ఆలోచన గల నీవు గర్వముతో ఉన్నావు. ఈ విధముగా తపస్సు చేయుట అనునది ముసలివాళ్ళకు మాత్రమే తగిన పని. సమస్తసద్గుణములు ఉన్నదానవు. మూడు లోకములలో సుందరివి అయిన నువ్వు ఇట్లు పలుకుట తగదు. నీ యౌవనము దాటిపోవుచున్నది. ఓ! మంగళప్రదురాలా! నేను లంకాధిపతిని. దశగ్రీవుడు అని ప్రసిద్ధిచెందినవాడను. అట్టి నాకు భార్యవై నీవు సుఖముగా భోగములు అనుభవింపుము. నీవు విష్ణువని అనుచున్నవాడు ఎంతటివాడు! నీవు కోరుచున్న విష్ణువు వీర్యము చేతగాని, తపస్సు చేతగాని, భోగము చేతగానీ, బలముచేత గానీ నాతో సమానుడు కాదు'' అనెను. 
 
వాని మాటలు విని వేదవతి ''అట్లనకుము అట్లనకుము''అని పలికెను. ఆ కన్య ఆ రాక్షసునితో మరల - ''రాక్షసరాజా! నీవు తప్ప బుద్ధిమంతుడైన మరెవ్వడైనా మూడులోకముల అధిపతీ, సర్వలోకములచేత నమస్కరింపబడువాడూ అయిన విష్ణువును అవమానించునా?" అనెను. ఆ వేదవతి అట్లు చెప్పుచుండగా రావణుడు హస్తాగ్రముతో ఆమె శిరోజములను పట్టుకొనెను. అప్పుడు వేదవతి కోపించనదై హస్తముచేత కేశములను ఛేధించెను. అప్పుడు ఆమె హస్తము కత్తిగా అయి కేశములను ఛేదించెను. రోషముతో మండుచున్నదా అన్నట్లున్న ఆమె రావణుణ్ణి కాల్చివేయుచున్నదా అన్నట్లు చూస్తూ అగ్నిని ఏర్పరుచుకుని, మరణించేందుకు తొందరపడుచూ రావణునితో "ఓ చెడ్డ రాక్షసుడా! నీ నుండి అవమానము పొందిన పిమ్మట నేను జీవించుటకు ఇచ్ఛగించను. నీవు చూచుచుండగానే అగ్నిలో ప్రవేశించెదను. పాపాత్ముడైన నీవు నన్ను వనములో అవమానించావు. అందువలన నిన్ను హతమార్చడానికి నేను మళ్ళీ జన్మిస్తాను. పాపనిశ్చయము గల పురుషుణ్ని స్త్రీ చంపజాలదు కదా? నీకు శాపమిచ్చినచో నా తపస్సు వ్యయమైపోవును. నేను ఏదైనా మంచిపనికాని, దానముకాని, హోమము కానీ చేసి వున్నచో దానికి ఫలితముగా రాబోవు జన్మలో ఒక ధర్మాత్మునికి అయోనిజమైన కుమార్తెగా, పతివ్రతగా పుట్టగలను" అని పలికి ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించును. అపుడు అంతటా దివ్యమైన పుష్పవృష్టి కురిసెను.
 
పద్మము వంటి కాంతిగల ఆమె మరల పద్మములో జన్మించెను. ఆ రాక్షసుడు మరల ఆమెను గ్రహించెను. పద్మమధ్యభాగము వంటి కాంతిగల ఆ కన్యను గ్రహించి ఆ రావణుడు తన ఇంటికి వెళ్లెను. ఈమెను తీసుకుని వెళ్ళి మంత్రికి చూపెను. సాముద్రికా లక్షణములు తెలిసిన మంత్రి ఆ శిశువును చూడగానే రావణునితో ''ఈమె నీ వధకొరకే గృహము చేరినది'' అని పలికెను. ఆ మాట విని రావణుడు ఆమెను సముద్రంలోకి విసిరివేసెను. ఉత్తమురాలైన ఆమె భూమిని చేరి, జనకుని నాగలి అగ్రభాగముచేత గీయబడినదై మరలపైకి వచ్చినది. నాగలిచేత దున్నిన క్షేత్రమునందు, మరల మానవులలో పుట్టినది. పూర్వము కృతయుగమునందు వేదవతి అను పేరుతో ఉన్న ఈమె త్రేతాయుగము నందు రావణుని సంహరించుటకు మహాత్ముడైన జనకుని కులమునందు జనించినది. సీత (నాగలిచాలు) నుండి జనించుటచే ఈమెకు ''సీత'' అనే పేరు వచ్చెను.
- దీవి రామాచార్యులు(రాంబాబు)------ ఇంకావుంది(జానకి రామాయణం)

Share this Story:

Follow Webdunia telugu