Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రిజటా స్వప్నము.. సీతను భయపెట్టకండి.. రాముడు రానున్నాడు..!

సీత ఎడమకన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ అదురుచున్నది.. !

త్రిజటా స్వప్నము.. సీతను భయపెట్టకండి.. రాముడు రానున్నాడు..!
, శనివారం, 27 ఫిబ్రవరి 2016 (13:28 IST)
సీత మాటలు విని రాక్షస స్త్రీలు చాలా కోపావేశము చెందిరి. వారిలో కొందరు, సీత మాటలను దురాత్ముడైన రావణునకు చెప్పుటకై వెళ్ళారు. చూచుటకు భయంకరముగా ఉండు ఆ రాక్షసస్త్రీలు సీతను సమీపించి మరల పూర్వము చెప్పిన విషయమునే చెప్పుచు, అనర్థకరమైన పరుషవాక్యములు పలికారు - ''అనార్యురాలవు, పాపనిశ్చయము గలదానవూ అయిన ఓ సీతా! రాక్షసస్త్రీలు ఈనాడు, ఇప్పుడే నీ మాంసమును సుఖముగా భక్షించెదరు.''
 
ఆ రాక్షసస్త్రీలు ఆ విధముగా భయపెట్టుచుండగా చూసి, అంత వరకూ నిద్రించిన త్రిజట అనే ఒక వృద్ధరాక్షసి వాళ్ళతో, ఓ దుష్టులారా! మీ భక్షించవలసినది జనకుని ప్రియపుత్రికా, దశరథుని కోడలూ అయిన సీతను కాదు, మిమ్ములను మీరు భక్షించుడు. ఇప్పుడే నాకొక భయంకరమూ, రోమాంచము పుట్టించునదీ అయిన స్వప్నము వచ్చినది. అది రాక్షసుల వినాశనమును, ఈమె భర్త అభ్యుదయమును సూచించుచున్నది'" అని పలికెను. 
 
క్రోధముతో నిండి ఉన్న ఈ రాక్షస స్త్రీలందరూ త్రిజట మాటలు విని, భయపడుచు ఆమెను ''నీవు రాత్రి ఎట్టి స్వప్నము చూచితివో చెప్పుము'' అని అడగగా త్రిజట తనకు ఆ సమయమునందు (ఉష్ణకాలమునందు) వచ్చిన స్వప్నమును గూర్చి చెప్పెను. 
 
సీత రామునకు అతి ప్రియురాలు, బహుమానపాత్రురాలు అయిన భార్య. అతనిని అనుసరించి వచ్చి, వనవాసవ్రతమును అవలంభించిన సాధ్వి. అట్టి భార్యను ఎవరైనా భయపెట్టినా, దూషించినా రాముడు సహించడు. అందుచేత సీతతో పరుష వాక్యములు పలుకవద్దు. మంచిమాటలే చెప్పండి. సీతను బ్రతిమాలుకుందాము. నాకు ఇదే ఇష్టము. ఎవ్వరైనా స్త్రీ కష్టాలలో ఉన్నప్పుడు ఈ విధమైన స్వప్నము వచ్చినచో, ఆమె సర్వదుఃఖములనుండి విముక్తురాలై అత్యుత్తమమైన ప్రియమును పొందెను. 
 
రాక్షసస్త్రీలారా! ఇంకా ఏమేమో చెప్పి ప్రయోజనము లేదు. ఇంత వరకు ఈమెను భయపెట్టినాము. ఇపుడింక ఈమెను బ్రతిమాలుకొనుట మంచిది. రాక్షసులకు రాముని నుండి గొప్ప ఆపద వచ్చిపడినది. జనకాత్మజయైన సీతను నమస్కరించి అనుగ్రహింపజేసుకొన్నచో ఈమె మనలను మహాభయము నుండి రక్షించగలదు. 
 
విశాలాక్షియైన ఈ సీత అవయవములలో, అంతములేని దుఃఖమును సూచించు చెడ్డ లక్షణము, అతి సూక్ష్మమైనది కూడా, ఏదీ నాకు కనబడుట లేదు. ఈమె శరీరకాంతిలో మాత్రము కొంత లోపమును చూచుచున్నాను. అందుచేతనే విమానమును ఎక్కిన (భోగము అనుభవించవలసిన) దుఃఖము అనుభవించకూడని సీతకు దుఃఖము కలిగినదని తలచుచున్నాను. సీతకు కార్యసిద్ధి త్వరలోనే కలుగునట్లు కనిపించుచున్నది. రావణుని వినాశమూ, రాముని విజయమూ కూడా దగ్గరలోనే ఉన్నట్లు కనబడుచున్నది. 
 
ఈమె గొప్ప ప్రియవార్తను విననున్నది అను విషయమునకు సూచకముగా పద్మపత్రము వలె ఆయతమైన ఈ నేత్రము (సీత ఎడమకన్ను) అదురుచున్నది. సాధుస్వభావము గల ఈ సీత ఎడమ భుజము హఠాత్తుగా పొంగినదై, కొంచెము అదరుచున్నది. ఏనుగు తొండముతో సమానము, శ్రేష్ఠము అయిన ఈ సీత ఎడమ తొడ అదురుచున్నది. రాముడు దగ్గరనే ఉన్నాడని ఇది సూచించుచున్నది. 
 
ఒక పక్షి కొమ్మపై ఉన్న గూటిలో కూర్చుండి, మాటిమాటికి ఊరడింపు మాటలు పలుకుతూ, చాలా ఉత్సాహముతో కూడినదై స్వాగత వచనములు పలుకుతూ "రాముడు రానున్నాడు" అని సీతకు చెప్పుచున్నట్లున్నది''. - ఇంకా ఉంది.. దీవి రామాచార్యులు (రాంబాబు)

Share this Story:

Follow Webdunia telugu