మాఘమాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెల జనవరి 19 నుంచి మాఘమాసం ప్రారంభం కాబోతోంది. మాఘం అంటే పాపాలను తొలగించేది అని అర్థం. ఈ మాసం శ్రీమహావిష్ణువుకు, సూర్య భగవానుడికి, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా బావి స్నానం చేయడం మహా పుణ్యప్రదమని నమ్ముతారు. శీతాకాలం చివరలో వచ్చే ఈ సమయంలో తెల్లవారుజామున చల్లని నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యకిరణాల ద్వారా లభించే విటమిన్-డి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
మాఘమాసంలో ప్రయాగ (అలహాబాద్) లోని త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వసంత పంచమి వస్తుంది. ఆనాడు చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినం. అక్షరాభ్యాసాలకు చాలా శుభప్రదం. అలాగే రథ సప్తమి కూడా వస్తుంది. సూర్య భగవానుడి పుట్టినరోజు. సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్ళించే రోజు.
భీష్మ అష్టమి కూడా మాఘమాసంలో వస్తుంది. ఆరోజు భీష్మ పితామహుడు స్వచ్ఛంద మరణం పొందిన రోజు. పితృ తర్పణాలకు విశేషమైనది. మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానాలకు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు విశేషమైన రోజు. మాఘ బహుళ చతుర్దశి నాడు జరుపుకునే మహాశివరాత్రి పండుగ శివార్చనకు ప్రత్యేకం