Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏడు దశాబ్దాల సత్యసాయి సేవలకు ఇక బ్రేకేనా!!

ఏడు దశాబ్దాల సత్యసాయి సేవలకు ఇక బ్రేకేనా!!
, సోమవారం, 25 ఏప్రియల్ 2011 (17:56 IST)
WD
దాదాపు ఏడు దశాబ్దాలుగా కొనసాగిన సత్యసాయి సేవలు ఇకపై కూడా కొనసాగుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరి వల్లా కాదు. ఈ సేవలు కొనసాగాలంటే ప్రభుత్వం, సత్యసాయి సేవా ట్రస్ట్‌లు దృష్టి సారించాల్సి ఉంది. అయితే, ఈ రెండింటిపైనా కోట్లాది మంది భక్తులకు లేనిపోని అనుమానాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.

గత 27 రోజులుగా అనారోగ్యం పాలైన బాబా.. తాను నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో బాబాకు సంబంధించిన ఒక ఛాయా చిత్రాన్ని కూడా ట్రస్టుగానీ, ప్రభుత్వం గానీ మీడియా ద్వారా భక్తులకు చూపించిన పాపాన పోలేదు. బాబా ఆరోగ్యంపై ట్రస్టుపై ఎన్నో విమర్శలు వచ్చినా ఏనాడూ స్పష్టంగా వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకే.. సత్యసాయి సేవలు ఇకపై కొనసాగే అంశంపై నీలి నీడలు అలముకున్నాయి.

కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన సత్యసాయి.. గత ఏడు దశాబ్దాలుగా ఈ మానవాళికి అలుపెరగని సేవ చేశారు. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక బోధనలతో తన వంతు కృషి చేశారు. ఈ సమాజం మార్పు కోసం అహర్నిశలు పాటుపడ్డారు. అలాంటి బాబా ఆదివారం ఉదయం 7.40 నిమిషాలకు నిర్యాణం చెందినట్టు ట్రస్ట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన బాబా.. సుమారు 200 ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా మారారు. తన ఆచరణ మార్గం ద్వారా భక్తులను ఆధ్యాత్మికం వైపు నడిపించారు. అలా.. ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు దశాబ్దాల పాటు మానవాళికి శాంతి సందేశం ఇచ్చి... తాను శాశ్వతంగా భక్తులకు దూరమయ్యారు.

తన బోధనలతో ప్రపంచాన్ని తేజోమయం చేసిన ఈ దివ్యమూర్తి దివికేగారు. కొలిచే భక్తులకు కదిలే దైవంగా పేరుగాంచిన కోట్లాది మంది భక్తులను శోకసముద్రంలో ముంచెత్తారు. ఆ మహనీయుడు లేడన్న వార్తను తట్టుకోలేక అనేక హృదయాలు బోరున విలిపించాయి. సాక్షాత్ భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ సైతం కన్నీరు పెట్టారు.

ఇక్కడ విచిత్రమేమింటే.. తన వద్దకు వచ్చే భక్తులకు, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న మహోన్నత సంకల్పంతో నిర్మించిన ప్రశాంతి నిలయం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే ఒక రోగిగా చేరి చివరకు అక్కడే తుదిశ్వాస విడవడాన్ని ఆయన భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu