Publish Date: Tue, 30 Dec 2025 (09:43 IST)
Updated Date: Tue, 30 Dec 2025 (11:02 IST)
వైకుంఠ ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి తిథి నాడు మనం ఎలాంటి భగవత్ సంబంధమైన కార్యం చేసినా దాని ఫలితం కూడా కోట్ల రెట్లలో ఉంటుందట.
ముక్కోటి ఏకాదశి తిథి రోజు ఒక తులసీ దళం పట్టుకొచ్చి శ్రీమహావిష్ణువు మనస్ఫూర్తిగా సమర్పిస్తే మూడు కోట్ల తులసీ దళాలు సమర్పించిన ఫలితం దక్కుతుందట. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు భక్తిశ్రద్ధలతో విష్ణు క్షేత్రంలో శ్రీరంగనాథుడి స్మరిస్తూ.. భగవన్నామస్మరణలో ఉంటే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదట.
ఈ వైకుంఠ ఏకాదశి రోజున నిత్య పూజ, ఇష్టదేవతారాధన చేసుకుని దగ్గర్లోని వైష్ణవ ఆలయంలో సంఘంగా ఏర్పడి సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామం, గోవింద నామాలు పఠించడం, త్యాగరాజ స్వామి సంగీత విభావరి వినడం, భజనలు, కీర్తనలు చేయాలి. ముక్కోటి ఏకాదశి చేయగలిగితే మూడు కోట్ల ఏకాదశుల ఫలితం దక్కుతుందట.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఈరోజు మహా విష్ణువును వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందనే లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించిపోతున్నారు.