Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అట్లాంటాలో తెలుగు సంఘసేవకురాలు దుర్మరణం

అట్లాంటాలో తెలుగు సంఘసేవకురాలు దుర్మరణం
FILE
అమెరికాలోని అట్లాంటాలో.. సామాజిక కార్యకర్తగా ప్రవాస భారతీయులందరికీ సుపరిచితురాలైన తెలుగు మహిళ మాధురి వేములపల్లి (40) రోడ్డు ప్రమాదంలో మరణించారు. విధుల్లో భాగంగా కారులో ప్రయాణిస్తున్న మాధురి.. ప్రమాదానికి గురై మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. మాధురి భర్త విజయ్ వేములపల్లి.. పేద బాలల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సామాజిక సేవా సంస్థ అయిన "విభ" యూఎస్ శాఖ కార్యదర్శిగా, భారత విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇదే సంస్థలోనే మాధురి కార్యకర్తగా.. గత 13 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. అలాగే.. వృత్తిరీత్యా ఈ దంపతులిద్దరూ ఐ.టీ. ఎగ్జిక్యూటివ్‌లుగా కూడా పనిచేస్తున్నారు.

మాధురి దంపతులకు సంతానం దివ్య అనే ఎనిమిది సంవత్సరాల అమ్మాయి మాత్రమే. మాధురి మరణవార్త తెలుసుకున్న భారత్‌లోని ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన అమెరికాకు బయల్దేరి వెళ్లారు. కాగా.. ఆమె ఆకస్మిక మరణంపట్ల "విభ" తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది.

విభ సంస్థ సభ్యులు, కార్యకర్తలతోపాటు.. పలువురు స్థానిక ప్రవాసాంధ్రులు మాధురి మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక కార్యకర్తగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు కొనియాడారు. క్రమశిక్షణ, కలుపుగోలుతనం కలిగిన మాధురి స్నేహపూరిత మనస్తత్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ వారంతా ఆమెకు అంజలి ఘటించారు.

Share this Story:

Follow Webdunia telugu