Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌లో "గ్లోబల్ ఆర్మ్"ను ప్రారంభించిన కిరణ్ బేడీ..!!

దుబాయ్‌లో
FILE
నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో) సంస్థ అయిన నవ్‌జ్యోతి ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే "గ్లోబల్ ఆర్మ్"ను భారత దేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి, మెగస్సెసే అవార్డు గ్రహీత కిరణ్ బేడీ ప్రారంభించారు. భారత్‌లో పాఠశాలలను ప్రారంభించాలంటూ ప్రవాస భారతీయులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఆమె, విద్యా సంబంధిత స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాములను అందించే లక్ష్యంతో ఈ గ్లోబల్ ఆర్మ్‌ను ఏర్పాటు చేశారు.

భారతదేశంలో పాఠశాలలను ప్రారంభించి, వాటి ద్వారా పిల్లలను విద్యావంతులను చేయాలంటూ ప్రవాస భారతీయులు కిరణ్ బేడీని అభ్యర్థించారు. దీనికి స్పందించిన ఆమె దుబాయ్‌లో గ్లోబల్ ఆర్మ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బేడీ మాట్లాడుతూ.. తమ ఎన్జీవో సంస్థకు సాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

భారతదేశంలోని ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉందనీ, ఇందుకోసం వారంతా వేచి చూస్తున్నారని కిరణ్ బేడీ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా గ్లోబల్ ఆర్మ్ ద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను దేశంలోని పిల్లలందరికీ అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

తమ ఎన్జీవో సంస్థ భారతదేశంలోని ప్రజలకు మరియు తమ సహాయాన్ని అర్థించే కుటుంబాలలోని పిల్లలకు విద్యా సంబంధిత సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని కిరణ్ బేడీ పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ ప్రస్తుతం 5 వేలమంది చిన్నారులకు ముఖ్యంగా మురికివాడలలో నివసించే చిన్నారులకు విద్యను అందిస్తోందని ఆమె చెప్పారు. ఇక చివరిగా కిరణ్ బేడీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం లేనట్లయితే ఈ ఆర్గనైజేషన్‌లో చేరాల్సిన అవసరం లేదని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu