Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20వ తానా మహాసభల కార్యదర్శి శ్రీ గోగినేని శ్రీనివాసతో ముఖాముఖీ

20వ తానా మహాసభల కార్యదర్శి శ్రీ గోగినేని శ్రీనివాసతో ముఖాముఖీ
, బుధవారం, 1 జులై 2015 (21:05 IST)
20వ తానా మహాసభలు డెట్రాయిట్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కదా.. కార్యదర్శిగా, అన్ని కార్యక్రమాలను సమన్వయపరచుకొనే ప్రధాన బాధ్యతలో మీ అనుభవాలను చెబుతారా?
 
ముఖ్యంగా డెట్రాయిట్లో అంకితభావంతోను, క్రమశిక్షణతోనూ పనిచేసే స్వచ్చంద కార్యకర్తలకు, ప్రతిభాపాటవాలకు మరియు దాతృత్వానికి కొరత లేని విషయం జగద్వితం. అందునా తానా సంస్థపై ఆదరాభిమానాలను కలిగివున్నవారు ఎందరెందరో, నేను ఇప్పటికే అనేక సంవత్సరాలుగా తానా సంస్థలో తానా ఫౌండేషన్ సహాయ కార్యదర్శి, కోశాధికారి, ప్రస్తుతం కార్యదర్శిగానే కాకుండా తానా బోర్డు సభ్యులుగా ఉండడంతో ఎక్కువమందితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాను.
 
అలాగే ఈ తానా మహాసభలకు సహ సమర్పకులైన స్థానిక డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ నాయకత్వం మరియు సభ్యులతో గత కొద్ది సంవత్సరాలుగా అనేక సమస్యలు మరియు కార్యక్రమాలకు చేదోడువాదోడుగా ఉండటం కూడా నాకు చాల సహకరించింది. అంతేకాకుండా కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ గారు, ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్ గారు, డైరెక్టర్ మరియు గత ప్రెసిడెంట్ కోమటి జయరాం గారు, గత ప్రెసిడెంట్ మరియు సలహా కమిటీ చైర్మన్ బండ్ల హనుమయ్య గార్లతో వ్యక్తిగతంగాను వ్యవహార పరంగానూ సన్నిహిత సాంగత్యం మంచి సుఖమైన వాతావరణం కలిగించింది. 
 
పై చెప్పిన అనేక కారణాలు ఈ తానా మహాసభలకు సంబంధించిన ముఖ్యమైన కమిటీల నాయకులను ఎంపిక చేయటంలో వారికి వివిధ భాద్యతల బదలాయింపులో  చాలా ఉపయోగపడింది, ఇంకా చెప్పాలంటే ఆ నియామకాల కారణంగానే ఈ రోజున సమావేశాల గురించినంతవరకు ఏంతో ధైర్యంగా, స్థైర్యంగా మరియు నమ్మకంగా ఉన్నాము. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎటువంటి చిన్న సమస్య లేకుండా ఏర్పాట్లు జరుగుతూ ఉండటం అందరూ గమనిస్తున్నారు కదా. 
 
ఈ సారి జరుగబోతున్న తానా సభలు ఎందువల్ల ప్రత్యేకత సంతరించుకొన్నాయి?
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడివడి అభివృద్ధిపధంలో దూసుకుపోతున్న తరుణంలో జరుగనున్న మొట్టమొదటి సమావేశాలుగా గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈ తానా సమావేశాల మూలధ్యేయం “సేవ: సంస్కృతికి జీవం, సమైక్యతకు బలం“ను రెండు రాష్ట్రాల నాయకత్వానికి, ప్రజలకు తానా సంస్థ ఇచ్చే సందేశంగాను మరియు తానా సంస్థ యొక్క భవిష్యత్ కార్యాచరణకు ప్రామాణికంగాను భావించవచ్చును. మామూలుగానే అంతర్జాతీయం గుర్తింపు పొందిన తానా ద్వైవార్షిక మహాసభలకు ఈ పరిస్థితుల్లో సమావేశాల్లో జరుగబోయే కార్యక్రమాలపై తెలుగు ప్రజలందరిలో ఎంతో ఆసక్తి, ఉత్సుకత కలుగడంలో ఆశ్చర్యం లేదు. వాటితోపాటు గొప్ప నాయకత్వం మరియు వాలంటీర్స్ ఉన్న డెట్రాయిట్లో సమావేశాలు జరగనుండటం కూడా ఈ సమావేశాలకు ప్రత్యేకత తెచ్చాయని భావిస్తున్నాను.
 
ఈ కార్యక్రమ సన్నాహాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? వివిధ కమిటీల గురించి కొంచెం చెప్పండి!
ఈ కార్యక్రమ సన్నాహాలు ఎంతోముందుగా అంటే గత 2014 సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యాయి. తదుపరి అంచెలంచలుగా సుమారు 45 కమిటీలు 500 మంది కార్యకర్తలతో టీం బిల్డింగ్ జరిగింది. వారివారి నిపుణత మరియు ఆసక్తిలను అనుసరించి ఈ కమిటీల నాయకులను, ఉపనాయకులను నియమించటం జరిగింది. వీటిలో అతిముఖ్యమైన ప్రోగ్రాం/ఈవెంట్స్, ఆహార, రిజిస్ట్రేషన్, కల్చరల్, ధీంతానా, ఎక్జిబిట్స్, లిటరరీ, ఆధ్యాత్మిక, వ్యవసాయ, బిజినెస్, హాస్పిటాలిటి, వెన్యు, అలంకరణ, బాంకేట్ మరియు పొలిటికల్ కమిటీలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. మొదటిసారిగా మొబైల్ ఆప్‌ను కూడా IT కమిటీ ద్వారాను, మొట్టమొదటిసారిగా రైతు సమస్యలపై వ్యవసాయ కమిటీను, విస్తృత స్థాయిలో ఇన్ఫర్మేషన్ హెల్ప్ కమిటీను ఈ సమావేశాల్లో ప్రముఖంగా గమనించవచ్చును. అయితే సంక్లిష్ట మైన ఈ కమిటీల నిర్వహణ అన్నింటికీ కావలసిన నిపుణత కలిగిన స్వచ్చంద వాలంటీర్స్ డెట్రాయిట్లోనే ఉండటం మా అదృష్టం
 
ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తెలుగువారి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈసారి వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం చెయ్యబోతున్నారని విన్నాం. అసలు ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చెయ్యాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అలాగే ఈ కార్యక్రమం వల్ల ఒనగూరే లాభాల గురించి కొంచం చెప్పండి.
ముఖ్యంగా పూర్వ అధ్యక్షులైన బండ్ల హనుమయ్య గారి ఆశయం మరియు కో-ఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ గారి ప్రోత్సాహం ఈ మహత్తర కార్యక్రమం రూపుదాల్చటానికి ముఖ్య కారణం. ఈ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలతో సతమతము అవుతున్న రైతు సోదరులకు ఉపయోగకరమైన చర్చలు ముఖ్యంగా విత్తనాలు, భూసార పరీక్షలు, యంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు మరియు ఆధునిక వ్యవసాయం వగైరాలపై అర్ధవంతమైన మరియు ఫలవంతమైన సూచనలు, సలహాలు వస్తాయని ఆశిస్తున్నాము. అంతేకాక రైతు సోదరులకు ప్రవాసభారతీయుల నుంచి కొన్ని విషయాలలో శాశ్వత మరియు తాత్కాలిక ఉపశమనానికి సంబందిచిన సహాయానికై విధానపర నిర్ణయాలకు కూడా అవకాశం ఉంది
 
తానా అమెరికాలో ఒక జాతీయ సంస్థ. అంటే వివిధ రాష్ట్రాల్లోని వివిధ కమిటీలతోనూ, వ్యక్తులతోనూ నిరంతరం సంభాషణలు, సంప్రదింపులూ జరుపుతూ ఉండాలి. మీరు దీన్ని ఎలా నిర్వహించారో కొంచెం చెప్పండి. 
తానా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతంగా నిర్వహించబడుతున్న ఏకైక తెలుగు సంస్థగా గత 40 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఇది అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం కలిగివుండి తెలుగువారి ప్రతిసమస్యకు, అభివృద్ధికి ఒక పర్యాయపదంగా వున్న విషయమే వివిధ రాష్ట్రాల్లోని వివిధ కమిటీలతోనూ, వ్యక్తులతోనూ నిరంతరం సంభాషణలు, సంప్రదింపులూ జరుపుతూ ఉన్నాయనటానికి నిదర్శనం
 
ఈ తానా మహా సభల కార్యదర్శి పదవితో పాటు గత రెండు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన తానా ఫౌండేషన్ కార్యదర్శిగా కూడా పదవి నిర్వహిస్తున్నారు, మరి ఈ రెండు భాద్యతాయుతమైన పదవులను ఒకేసారి నిర్వహించవలసిన అవసరం మరియు అందలి అనుభవాలను చెప్పగలరా?
తానా ఫౌండేషన్ పదవులు ద్వారా తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సేవ చేయటం నాకు అత్యంత ఇష్టమైన మరియు సంతృప్తికరమైన విషయం. ఆయితే ఈసారి ప్రతిష్టాత్మకమైన తానా ద్వైవార్షిక మహా సభలు అనుకోకుండా డెట్రాయిట్లో నిర్వహించవలసిన అవసరం రావడం, డెట్రాయిట్లోని ప్రత్యేక స్థానిక పరిస్థితులు కారణంగా తానా ముఖ్యనాయకత్వం ఈ కార్యదర్శి పదవికి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు నేను కో-ఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ గారికి, అధ్యక్షులు నన్నపనేని మోహన్ గారికి మరియు తానా డైరెక్టర్ కోమటి జయరాంగారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుప వలసిన అవుసరం ఉంది. ఇంకా నిబద్దతతో పనిచేసే వారికి తానా సంస్థలో తగిన గుర్తింపు , పదవులు అందుబాటులోనే ఉంటాయనేదానికి నిదర్శనగా భావించవచ్చును. ఈ పదవీ నిర్వహణలో అనేకమంది నిపుణులతోను, పెద్దలతోను, సన్నిహితులు మరియు మిత్రులతో పాటు భాద్యతలు నిర్వహించటమే గాక చాలా విషయాలను నేర్చుకున్నాను
 
తానాతో పాటు ఇంకా అనేక ఇతర తెలుగు జాతీయ సంస్థలు ఉన్నాయి మరియు అవి కూడా ఇంచుమించు ఇవే కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంలో తానా ప్రత్యేకతను, ఈ సమావేసాలకే ప్రాముఖ్యత ఇవ్వాలనే మీ ఆలోచనకు ప్రాతపదిక ఏమిటి?
భారతదేశం ఆవల ఉన్న వాటిలోని అతిపెద్దదై మహోన్నత చరిత్ర కలిగిన తానా సంస్థ గత 40 సంవత్సరాలుగా తెలుగు భాషకు, సంస్కృతికి మరియు తెలుగు ప్రజల సంక్షేమానికి చేస్తున్న అవిరళ కృషి నభూతో నభవిష్యతి అన్నది అక్షర సత్యం. ఈ కార్యక్రమలో లబ్దిదారులను ఎటువంటి వివక్ష (ప్రాంతం, కులం లేదా మతం ) లేకుండా టీం స్క్వేర్ ద్వారా గాని, తానా ఫౌండేషన్ ద్వారా గాని గుర్తించి సహాయపడంలోను , అనేక ఇతర సాంస్కృతిక, సేవాకార్యక్రమాలలోనూ ముందున్న విషయం జగద్వితం. ఈ విషయాలే ఇతర తెలుగు జాతీయ సంస్థలతో పోల్చినప్పుడు తానా ప్రత్యేకతను, ఈ సమావేసాలకే ప్రాముఖ్యత ఇవ్వాలనే ఆలోచనకు ప్రాతిపదిక.
 
ఈసారి జరుగబోతున్న తానా సభలకు ఎంతమంది హాజరవబోతున్నారని మీ అంచనా?
పదివేలమందికి తక్కువగాకుండా హజారవుతారని మేమందరం భావిస్తున్నాము. ఇప్పటికే రికార్డు స్థాయిలో దాతల విరాళాలు, 7 వేలమందికి పైగా ముందే చేసుకున్న రిజిస్ట్రేషన్లు ఈ నెంబర్ ఇంకా బాగా పెరిగినా పెద్దగా ఆశ్చర్యం లేదు. కాన్ఫరెన్స్ కమిటీ అందరికీ ఏర్పాట్లుకై సంసిద్ధంగా ఉంది.
 
తానా సభలకు ఎందుకు హాజరవ్వాలి అనే విషయం ఒక్క మాటలో చెప్పగలరా ?
పై చెప్పిన అనేక విషయాలతో పాటు ఈ సభల సందర్భంగా మీ కుటుంబ సభ్యులు అందరితో కలసి వేసవి విడిదిగా ఇతర బంధుమిత్రుల కలయికతోనూ, మహత్తరమైన ప్రపంచస్థాయి వినోద, వైజ్ఞానిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య కార్యక్రమాలతోనూ, తెలుగు రుచుల విందులతోనూ పండుగ వాతావరణంతో చిరస్మరణీయంగా ఉండేవిధంగా కృషి చేస్తున్నాము కనుక తానా సభలకు తప్పక హాజరవ్వాలని చెప్పగలను. అంతేకాక అవకాశం ఉండీ హజారు కాలేకపోయిన వారు గొప్ప అవకాశం పోగొట్టుకున్నందుకు విచారపడతారని కూడా భావిస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu