Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షేర్ సింగ్ అవార్డును రద్దు చేసిన కెనడా

షేర్ సింగ్ అవార్డును రద్దు చేసిన కెనడా
భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది టీ. షేర్ సింగ్‌కు ప్రదానం చేసిన "ఆర్డర్ ఆఫ్ కెనడా" అవార్డును కెనడా ప్రభుత్వం రద్దు చేసింది. చట్ట విరుద్ధ కార్యకలాపాలు నెరపుతున్నారన్న కారణంతో ఆ దేశ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా, ఈ పురస్కారానికి ఎన్నికైన సిక్కుజాతి వ్యక్తుల్లో సింగ్ ప్రథముడు కావడం గమనార్హం.

పాట్నా నుంచి 1970వ సంవత్సరంలో కెనడా చేరుకున్న షేర్ సింగ్.. అక్కడి న్యాయవాద వృత్తిలో విశేషంగా ఖ్యాతిని గడించారు. "జాతుల మధ్య సంబంధాలు, వివిధ మతాలకు చెందినవారి మధ్య జరిగే సంభాషణలు" అనే అంశంపై ఆయన చేసిన కృషిని గుర్తించిన కెనడా ప్రభుత్వం... 2001లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన "ఆర్డర్ ఆఫ్ కెనడా" అనే అవార్డుతో సత్కరించింది.

అయితే... అనంతరం షేర్ సింగ్ న్యాయవాద వృత్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే 2007లోనే న్యాయవాద వృత్తి నుంచి సింగ్‌ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ సింగ్ తన కార్యకలాపాలను మానుకోకపోవడంతో.. ఆయనకిచ్చిన పై అవార్డును రద్దు చేసింది.

ఇదిలా ఉంటే... అవినీతి రాజకీయ నాయకుడిని సెనెట్‌కు నామినేట్ చేశారన్న విషయంలో 1990లలో ఆనాటి కెనడా ప్రధానమంత్రిని న్యాయస్థానానికి రప్పించిన కేసులో షేర్ సింగ్ పేరు ఒక్కసారిగా ప్రపంచ ప్రజల దృష్టికి వచ్చిన సంగతి విదితమే.

Share this Story:

Follow Webdunia telugu